
రంగారెడ్డి | సరూర్‌నగర్ |వారధి న్యూస్:గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మాహతో సరూర్‌నగర్ చెరువు వద్ద పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతం, విగ్రహాల తరలింపు మార్గాలు, భక్తుల రాకపోకలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సౌకర్యాలు, బారికేడింగ్, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లను జోనల్ కమిషనర్ పరిశీలించారు. భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌తో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్న వికాస్ మాహతో, చెరువు పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిమజ్జనం అనంతరం వ్యర్థాలను వెంటనే తొలగించేలా పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు అధికారులకు సహకరించాలని, నిర్దేశించిన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని పేర్కొన్నారు.














