
తిరుపతి జిల్లా | చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నెన్నూరు పంచాయతీకి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గత రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన మధుసూదన్‌రెడ్డి.. శుక్రవారం తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమపై నమ్మకంతో పార్టీలో చేరిన మధుసూదన్‌రెడ్డికి సముచిత గుర్తింపు ఇస్తామని, తగిన బాధ్యతలు అప్పగించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మధుసూదన్‌రెడ్డి చేరికతో నెన్నూరు గ్రామంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.














