
నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం
ఆమనగల్ | వారధి న్యూస్: ఆమనగల్ పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి భవన నిర్మాణ పురోగతి, వివిధ విభాగాల ఏర్పాట్లు, నాణ్యత ప్రమాణాలు, పనుల వేగం తదితర అంశాలపై అధికారులు, కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం ప్రజల ఆరోగ్య అవసరాలకు అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన.. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ఆవరణను ముందున్న రహదారి స్థాయి కంటే ఎత్తుగా నిర్మించాలని సూచించారు. సీహెచ్సీ భవనాన్ని త్వరితగతిన వినియోగంలోకి తీసుకువచ్చేందుకు మిగిలిన అసంపూర్తి పనులను పూర్తి చేయాలని, నాణ్యతతో భవనాన్ని అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, లిఫ్ట్ ఏర్పాటు, మార్చురీ, డైట్ తదితర సదుపాయాలపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించారు. సీహెచ్సీకి అవసరమైన సిబ్బంది క్యాడర్ స్ట్రెంత్ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ఆమనగల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.













