
రంగారెడ్డి | సరూర్‌నగర్ | వారధి న్యూస్: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి, భద్రత, బాధ్యతతో విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్‌తో కలిసి సరూర్‌నగర్ కట్ట వద్ద కొనసాగుతున్న నిమజ్జన ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.
నిమజ్జనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నిమజ్జన ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారులకు సహకరిస్తూ భక్తి, భద్రత, బాధ్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఈఈ కార్తీక్, బీఆర్‌ఎస్ నాయకులు గండికోట శ్రీనాథ్, కోమల్ తదితరులు పాల్గొన్నారు.














