varadhinews.com

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్‌లో యాడ్‌ చేయడం, పార్శిల్‌ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూడటం.. ఇదంతా ఒక తీపి అనుభూతి. అయితే, ఈ అలవాటు జేబుకు బాగానే చిల్లు పెడుతుంది. ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా షాపింగ్‌ చేసేస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా యువత ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అదే డోపమైన్‌ సైట్లలో షాపింగ్‌ చేయడం. నిజానికి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు.. వాటిని కొనడం వల్ల వచ్చే ఆనందం కంటే.. దానిని వెతికి, కార్ట్‌లో వేసి, ఆర్డర్‌ బటన్‌ నొక్కే ప్రక్రియలోనే మన మెదడులో ‘డోపమైన్‌’ అంటే ఆనందాన్నిచ్చే హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుందని సైకాలజిస్టులు చెబుతారు. కొరియాలో వచ్చిన ఈ ఫేక్‌ డోపమైన్‌ అంటూ డూప్‌ మైన్‌ యాప్స్‌ సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుతున్నాయి. ఈ యాప్స్‌ చూడటానికి వంద శాతం అసలైన షాపింగ్‌ సైట్ల లాగే ఉంటాయి. ఇందులో వందలాది ప్రొడక్ట్స్, వాటి రేటింగ్‌లు, కస్టమర్‌ రివ్యూలు, డిస్కౌంట్‌ ఆఫర్లు అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దుస్తులు లేదా గాడ్జెట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని ‘కార్ట్‌’లో వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అడ్రస్‌ ఎంటర్‌ చేసి ‘ఆర్డర్‌’బటన్‌ కూడా నొక్కవచ్చు. ట్విస్ట్‌ ఏంటంటే మీరు ఆర్డర్‌ నొక్కగానే స్క్రీన్‌ మీద ఒక డెలివరీ బాయ్‌ మీ ఆర్డర్‌ని తీసుకుని, బైక్‌ మీద మీ ఇంటి వైపు వస్తున్నట్లు మ్యాప్‌లో లైవ్‌గా చూపిస్తుంది. వస్తువు మీ ఇంటికి చేరేవరకు ఉండే ఆ ఉత్కంఠ, ఎగ్జైట్‌మెంట్‌ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ చివరకు మీ ఇంటికి ఎలాంటి వస్తువూ రాదు, మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా కట్‌ అవ్వదు! దీంతో షాపింగ్‌ ఖర్చు నుంచి తప్పించుకోవడంతో షాపింగ్‌ చేశామన్న అనుభూతినీ పొందవచ్చు. ఈ పద్ధతిలో డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ, ఇది ఒక రకమైన మానసిక వ్యసనానికి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ఏ వస్తువు కొనకపోయినా, ఆ సైట్లలో గడపడం వల్ల షాపింగ్‌ చేయాలనే అదే ప్రవర్తన మెదడులో బలోపేతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్‌ దక్షిణ కొరియాకే పరిమితమైంది. ఏదేమైనా, షాపింగ్‌ పిచ్చిని వదిలించుకోవడానికి కొరియన్లు కనిపెట్టిన ఈ మార్గం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పైసా ఖర్చు లేకుండా షాపింగ్‌ మజాను అందించే ఈ ‘ఫేక్‌ స్టోర్స్‌’ ఐడియా మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు జులై 6లోపు అప్లై చేసుకోవాలి. బ్యాంకింగ్, టెక్నాలజీ, పాలసీ రీసెర్చ్ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్‌బీఐ మంచి అవకాశం కల్పిస్తోంది.. RBI Young Professionals Recruitment భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 12 యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 6, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రిస్క్‌, పాలసీ అనాలిటిక్స్‌, క్లైమేట్‌ చేంజ్‌ రిస్క్‌ అండ్‌ సస్టేయినబుల్‌ ఫైనాన్స్‌, క్రేడిట్‌ రిస్క్‌ అనలిటిక్స్‌ అండ్‌ రెగ్యులేటరీ పాలసీ, పేమెంట్‌ ఎకోసిస్టమ్‌, పాలసీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ డొమెస్టిక్‌ అండ్‌ క్రాస్‌బోర్డర్‌ పేమెంట్‌ సిస్టమ్‌, పాలసీ అండ్‌ రిసెర్చ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ, డేటా అనాలసిస్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌.. తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాన్ని బట్టి సీఏ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అప్లికేషన్‌ చివరి తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను yphrmdco@rbi.org.in ఈమెయిల్ ద్వారా పంపాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే యువ నిపుణులకు ఆర్‌బీఐ తాజా నియామకాలు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! .. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

దేశంలో దగ్గు మందుల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన నిబంధనలు తెచ్చింది. 1945 ఔషధ నిబంధనలను సవరిస్తూ ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. దేశంలో మందుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన తెచ్చింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు, జలుబు వస్తే నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి కొనుగోలు చేసే దగ్గు మందులపై కేంద్రం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల వారు దగ్గు మందులను విక్రయించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ 1945 నాటి ఔషధ నిబంధనలలో సవరణలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సాధారణంగా ఓవర్‌ ది కౌంటర్‌ లభించే దగ్గు నివారణ మందులను ఇకపై షెడ్యూల్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించింది. సాధారణంగా ఈ షెడ్యూల్ పరిధిలో ఉండే ఔషధాల విక్రయాలకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ వెసులుబాటును కేంద్రం రద్దు చేసింది. దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉపశమనం కోసం వాడే సిరప్‌లను ఇకపై మెడికల్ షాపుల్లో నేరుగా ఓవర్-ది-కౌంటర్ పద్ధతిలో అమ్మడానికి వీల్లేదు. అర్హత కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రాసిచ్చిన పత్రం చూపిస్తేనే ఫార్మసిస్ట్లు ఈ మందులను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులు అమ్మినట్లు తేలితే మెడికల్ షాపు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధించేలా కొత్త రూల్స్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో యువత, పాఠశాల విద్యార్థులు సైతం కొన్ని రకాల దగ్గు మందులను మత్తు కోసం, పరిమితికి మించి ఇష్టానుసారంగా వాడుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనికి తోడు, వైద్యుడి సలహా లేకుండా సొంత వైద్యం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారతీయ సిరప్‌ల నాణ్యతపై గతంలో కొన్ని వివాదాలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల మందుల బ్లాక్ మార్కెటింగ్‌కు, దుర్వినియోగానికి బ్రేక్ పడనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా చిన్నారుల మరణాలు నమోదుకావడం 2025 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగిన మధ్యప్రదేశ్‌ లోని చింద్వారాకు చెందిన 22 మంది చిన్నారులు మరణించగా.. కొందరు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలకు ఇచ్చిన కోల్డ్‌రిఫ్‌ దగ్గుమందుపై ఔషధ నియంత్రణ సంస్థ చేపట్టిన పరీక్షల్లో షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ దగ్గు సిరప్‌ ను సూచించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని పోలీసులు అరెస్టు చేశారు. సిరప్‌ను తయారు చేపిర తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్‌ ఫార్మా యూనిట్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేయగా అందులో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు తెలిపారు. మరో ఘటనలో జైపూర్‌కు చెందిన కేసన్స్ తయారుచేసిన సిరప్‌కు నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఈ సిరప్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. కిడ్నీ సంబంధిత సమస్యలున్న పిల్లలు ఈ సిరప్ తీసుకోవడం వల్ల మరింత తీవ్రమైన ప్రభావం పడుతోందని అధికారులు గుర్తించారు. 2 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు దగ్గు సిరప్ వాడకూడదని.. 5 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు సిరప్‌ను సూచించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల మరణాలకు కారణమైన ఆ దగ్గుమందును ఇతర ఏ ఏ దేశాలకు ఎగుమతి చేశారంటూ భారత్‌ను డబ్ల్యూహెచ్ఓ అడిగింది. గతంలో కొడిన్‌ దగ్గుమందు నైజీరియాలో లక్షలాది మందిని మత్తులో ముంచేసింది. దేశమంతటా యువతరం ఈ మందును మాదక ద్రవ్యంలా ఉపయోగించారు. ఈ దగ్గు మందుకు బానిసలైన వారి సంఖ్య బాగా పెరిగింది. డాక్టర్లు చీటీ మీద రాసిస్తే మాత్రమే అమ్మాల్సిన ఆ మందు డ్రగ్ డీలర్ల చేతుల్లోకి పోయి.. వీధుల్లో అక్రమ వ్యాపారానికి కారణమైంది. ఈ అంశాలపై అంతర్జాతీయ మీడియా ఆరా తీస్తే ఈ కుంభకోణంలో బడా ఫార్మా కంపెనీలున్నాయని వెల్లడైంది. నైజీరీయా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక రోజులో సుమారు 30 లక్షల సిరప్ సీసాలు అమ్ముడుపోయేవి. దీని తియ్యని స్ట్రాబెర్రీ రుచి పూర్తిగా బానిసగా మార్చేస్తుంది. కొడీన్ సిరప్ ను పరిమితికి మించి వాడితే అది మెదడుపై ప్రభావం చూపడమే కాదు ఉన్మాదిగా మార్చేస్తుందనీ నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పునరావాస కేంద్రంలో ఎక్కడ హింస చెలరేగుతుందోనని బాధితుల్ని గొలుసులతో కట్టేసి ఉంచాల్సి వచ్చింది. ప్రపంచానికి చౌకగా, నాణ్యమైన మందులు అందించే దేశంగా భారత్‌కు “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” అనే గుర్తింపు ఉంది. అయితే అక్టోబర్‌ 2025లో జరిగిన చిన్నారుల మరణాలు ఈ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వివాదం 2022లో ఆఫ్రికా దేశమైన గాంబియాలో మొదలైంది. అక్కడ పలువురు చిన్నారులు అనారోగ్యానికి గురై మరణించడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ప్రయోగశాల పరీక్షల్లో కొన్ని పిల్లల సిరప్‌లలో ప్రమాదకర స్థాయిలో డైఎథిలీన్ గ్లైకాల్ (DEG), ఎథిలీన్ గ్లైకాల్ (EG) అనే విషపూరిత రసాయనాలు ఉన్నట్లు తేలింది. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ దగ్గుకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రజారోగ్య ప్రయోజనాలు, మత్తు పదార్థాల నియంత్రణను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఎంతో అవసరమైన నిర్ణయమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. విదర్భ నుంచి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతున్న ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలోని బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాల అవకాశాలు ఎక్కువగా ఉండగా, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు.. ఈ క్రమంలోనే శనివారం నుంచి వాతావరణం మారిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, పలు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. రైతులు ఈ వర్షాలను స్వాగతిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. విద్యుత్ తీగలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యాంశాలు: