Homeతెలంగాణగర్ల్స్ హాస్టల్ ముసుగులో యువతుల అండాల విక్రయం.. వ్యభిచారం!

గర్ల్స్ హాస్టల్ ముసుగులో యువతుల అండాల విక్రయం.. వ్యభిచారం!

ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు

ఇతర రాష్ట్రాల యువతులే లక్ష్యంగా దారుణం

బాధితుల్లో బీహార్, యూపీ, ఒడిశా యువతులు

రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్ఓటీ.. నలుగురి అరెస్టు!

హైదరాబాద్ | వారధి న్యూస్ | అక్టోబర్ 31, 2026:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రాంతమైన బేగంపేటలో దిగ్భ్రాంతికర అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన సంతాన సాఫల్య ప్రక్రియను వ్యాపారంగా మార్చుకుంటూ.. యువతుల నుంచి అక్రమంగా అండాల సేకరణతో పాటు వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ భారీ ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ప్రకాశ్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ‘గర్ల్స్ హాస్టల్’ పేరుతో ఈ అక్రమ సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు గుర్తించిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఉత్తర్వుల మేరకు ఎస్ఓటీ (SOT) పోలీసులు ఆకస్మిక దాడి చేసి నిందితుల ఆట కట్టించారు.

హాస్టల్ ముసుగులో వ్యభిచారం.. అండాల వ్యాపారం!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రకాశ్ నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న నిర్వాహకులు, వెలుపల గర్ల్స్ హాస్టల్ బోర్డు తగిలించి గత ఏడాది కాలంగా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా నడుపుతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 10 మంది యువతులను ఇక్కడ ఉంచి, సంతాన సాఫల్య కేంద్రాల (ఫెర్టిలిటీ క్లినిక్స్) కోసం అక్రమంగా వారి నుంచి అండాలు సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా వారిని బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపినట్లు ఎస్ఓటీ అధికారులు గుర్తించారు.

నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్
పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు ఈ వ్యవహారంలో కీలకమైన నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడున్న 10 మంది బాధిత యువతులను కాపాడి రక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ దందా వెనుక పెద్ద ఎత్తున నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సేకరించిన అండాలను ఏ ఏ సంతాన సాఫల్య కేంద్రాలకు విక్రయిస్తున్నారు? దీని వెనుక ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్లు లేదా ఫెర్టిలిటీ సెంటర్ల పాత్ర ఏమిటి? అనే కోణంలో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల నెట్‌వర్క్ గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine