
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి.. అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు.. రైతుల భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు.. దళితుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
గద్వాల జిల్లా | గట్టు మండలం | రాయపురం | వారధి న్యూస్: గట్టు మండలం రాయపురం గ్రామంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు పేరుతో దళిత రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తోందని TRS పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ తెలిపారు. తరతరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
80 కుటుంబాల జీవనాధారం ఆ భూములే
రాయపురం గ్రామంలోని సర్వే నంబర్ 83లో ఉన్న సుమారు 50 ఎకరాల భూములపై దశాబ్దాలుగా రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని గొంగళ్ల రంజిత్ కుమార్ పేర్కొన్నారు. రైతులు సమర్పించిన వినతిపత్రం ప్రకారం, నాలుగు తరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, దాదాపు 80 కుటుంబాల బతుకులు వీటిపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
తరతరాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో పేద రైతుల పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు.
రీసెర్చ్ సెంటర్కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ ఉద్దేశమైతే, దళిత రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులకు న్యాయమైన పరిహారం, పునరావాసంపై స్పష్టత ఇవ్వకుండా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం సరైన విధానం కాదన్నారు.

గట్టు మండలం ఇప్పటికే సాగునీటి కొరత, ఉపాధి అవకాశాల లేమి, వలసల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఉన్న కొద్దిపాటి భూములను కూడా తీసుకుంటే వారి కుటుంబాలు మరింత ఇబ్బందులకు గురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన ప్రభుత్వం, వారి జీవనాధారాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు.
ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించాలి
రాయపురం గ్రామానికి వచ్చి దళిత రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని స్థానిక ఎమ్మెల్యేను గొంగళ్ల రంజిత్ కుమార్ కోరారు. జిల్లా కలెక్టర్ కూడా గ్రామాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకుని, వారి గోడును ప్రభుత్వానికి వివరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల హక్కులను కాపాడటం, పేదలకు అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని గుర్తుచేశారు.
రైతులకు అన్యాయం జరిగితే ఉద్యమం
త్వరలో తెలంగాణ రక్షణ సేన ప్రతినిధులు రాయపురం గ్రామంలోని భూములను పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారని గొంగళ్ల రంజిత్ కుమార్ తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే తెలంగాణ రక్షణ సేన, TRS పార్టీ వారి పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతాయని స్పష్టం చేశారు.
రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దళిత రైతుల హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బాధిత రైతులు కర్రెప్ప, మారెమ్మ, నర్సప్ప, వీరేష్, మారెప్ప, రాజు, తిప్పయ్య, ఈరన్న, నర్సిములు, అంపన్న, జంబయ్య, పాగుంట తదితరులతో పాటు తెలంగాణ రక్షణ సేన నాయకులు విష్ణు, ప్రేమ్ రాజ్, రంగస్వామి, గోపాల్, మీసాల కిష్టన్న, గట్టు మండల నాయకులు దయాకర్, వాసు, హనుమంతు, ఉలిగప్ప, మల్లయ్య, అమరేష్ తదితరులు పాల్గొన్నారు.













