
విజయవాడ | వారధి న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సి ఉండగా.. అధికార కూటమి ఒత్తిళ్లకు పోలీసులు, ఎన్నికల అధికారులు తలొగ్గుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని విమర్శించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడి తమ ఆందోళనను వెల్లడించారు.
హైకోర్టు ఆదేశాలున్నా అభ్యర్థులకు రక్షణ కరువు
పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు వాటిని అమలు చేయడం లేదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ఆరోపించారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించినా, కొందరు పోలీసులే అభ్యర్థులపై దాడులు చేస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు, గుత్తి ప్రాంతాల్లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు తుపాకులతో అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
తాడిపత్రిలో దాడులపై చర్యలేవీ?
తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించినా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగనివ్వకుండా అడ్డుకోవడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోనూ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్లతో సర్పంచ్ అభ్యర్థులను బెదిరించడం, పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రిగ్గింగ్‌తో గెలిచి స్ట్రైక్‌రేట్ గొప్పలా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్న 93, 94 శాతం స్ట్రైక్‌రేట్ ప్రజాస్వామ్యబద్ధంగా సాధించిన విజయం కాదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బెదిరింపులతో ఉపసంహరణలు చేయించడం, అక్రమాలకు పాల్పడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ఆ హక్కును అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాలరాయడం సరికాదని అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు తక్షణమే స్పందించి అభ్యర్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందా?
విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మాచర్లలోని కారంపూడిలో హైకోర్టు ఆదేశాల ప్రకారం అభ్యర్థులకు పోలీసులే రక్షణ కల్పించాల్సి ఉండగా, కొందరు అధికారులు వారినే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయ నాయకుల బెదిరింపులకు తోడు పోలీసుల నుంచి కూడా ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.
అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతుంటాయని, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. ఉద్యోగులుగా రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని సూచించారు.
నామినేషన్ సమయంలో అవసరమైన పత్రాలు స్వీకరించి రసీదులు ఇచ్చిన అధికారులు, స్క్రూటినీ సమయంలో పత్రాలు లేవని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రిటర్నింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. మాచర్ల నుంచి శ్రీకాకుళం వరకు పలువురు అధికారులు స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసి, అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు.












