గ్రామీణ, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

గద్వాల | వారధి న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పి.కృష్ణ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.
జిల్లాలోని గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లు, మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పి.కృష్ణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పట్టణాల్లో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
స్థానిక సంస్థల పనితీరును మెరుగుపరచడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని పి.కృష్ణ స్పష్టం చేశారు.













