Homeతెలంగాణజోగులాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం అక్రమాలు.. విచారణకు టీఆర్ఎస్ డిమాండ్

జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎంఆర్ ధాన్యం అక్రమాలు.. విచారణకు టీఆర్ఎస్ డిమాండ్

CMR paddy rice irregularities in Jogulamba Gadwal district

గద్వాల | వారధి న్యూస్:జోగులాంబ గద్వాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ధాన్యం వ్యవహారంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర నాయకులు, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, త్వరలోనే పూర్తి ఆధారాలతో సీఐడీ, ఈడీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

గద్వాలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంజిత్ కుమార్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు, మిల్లింగ్ ప్రక్రియ, ప్రభుత్వానికి బియ్యం తిరిగి అప్పగించే అంశాల్లో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ సివిల్ సప్లై శాఖ అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని విమర్శించారు. నామమాత్రపు తనిఖీలు, తూతూమంత్రపు దాడులతో అసలు విషయాలు బయటపడటం లేదని అన్నారు.

ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లులకు కేటాయించి, నిర్ణీత గడువులోగా బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగితే వాటిని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

జిల్లాలోని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ వివరాలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం పరిమాణంపై క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేవలం రికార్డుల ఆధారంగా కాకుండా వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ధాన్యానికి నష్టం వాటిల్లితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు.

సీఎంఆర్ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రైతుల కష్టార్జితానికి న్యాయం జరగాలని, ప్రభుత్వ ధాన్యం, ప్రజాధనం విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండకూడదని అన్నారు. ఈ అంశంపై తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ మల్దకల్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజి, మండల నాయకులు మీసాల కిష్టన్న, ప్రేమ్ రాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine