
హైదరాబాద్ |సరూర్‌నగర్| వారధి న్యూస్ : ఎల్‌బీనగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్యగా ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టి, ప్రజలకు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్ గౌడ్ వినాయకుడి ప్రతిమను అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కందికంటి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.













