
హైదరాబాద్ |చైతన్యపురి| వారధి న్యూస్ : గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గణేష్ సురక్ష సంకల్ప్–2026’ కార్యక్రమంలో భాగంగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అష్టలక్ష్మి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత రాకపోకలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీపీ బి. సుమతి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సమయంలో భక్తులు, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారులపై అనవసర రద్దీ ఏర్పడకుండా పోలీసులకు సహకరించాలని, వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని కోరారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. పోలీసుల సూచనలు, రూట్ డైవర్షన్లను వాహనదారులు పాటించాలని స్పష్టం చేశారు.
వినాయక మండపాల వద్ద భక్తుల భద్రతపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ సూచించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, అగ్నిప్రమాద నివారణ చర్యలు, భక్తుల రాకపోకలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
కార్యక్రమంలో ఎల్‌బీనగర్ డీసీపీ అనురాధ, ఐపీఎస్, ఎస్‌ఓటీ డీసీపీ మనోహర్, ఎస్‌బీ డీసీపీ నర్సింహారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఎల్‌బీనగర్ జోన్ ఏసీపీ రవీందర్ రెడ్డి, చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కె. సైదులుతో పాటు కమిషనరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల సహకారంతోనే గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించగలమని పోలీస్ అధికారులు తెలిపారు. భక్తి, ఆనందంతో పాటు భద్రతకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకోగా, భక్తులు, స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.














