
గద్వాల | కేటీ దొడ్డి | వారధి న్యూస్:కేటీ దొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాగుంట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ రక్షణ సేన (TRS) రాష్ట్ర నాయకులు, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్, గద్వాల జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో పురందర్ ముఖ్య అతిథులైన గొంగళ్ల రంజిత్ కుమార్, బుచ్చిబాబు యాదవ్‌లను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. పాగుంట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని అన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భక్తిభావాన్ని, సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేటీ దొడ్డి మండల నాయకులు రేణప్ప, పేపర్ స్వామి, సామెల్, ధారూరు మండల అధ్యక్షులు, కురువ మల్దకల్, మండల ప్రధాన కార్యదర్శులు గోపాల్, రాము, నాయకులు అడివి ఆంజనేయులు, పెద్ద జయప్ప, చిన్న జయప్ప, గోవిందు, మునెప్ప, ఆంజనేయులు, జగదీష్, సి. నర్సింహా, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.













