
హైదరాబాద్ | వారధి న్యూస్: తెలంగాణ పోలీసు శాఖలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో మార్గం సుగమమైంది.
తెలంగాణ పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులకు (ప్రమోషన్లు) మార్గం సుగమమైంది. డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవతో ఇందుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. కోర్టుల్లో కేసులకు స్వస్తి పలికే దిశగా అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. 1991, 1995, 1996 బ్యాచ్‌ల సివిల్ ఎస్సై (ప్రస్తుతం డీఎస్పీలు, అదనపు ఎస్పీలు)లతో మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు.
సీనియారిటీకి సంబంధించిన వివాదాలు, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ (ఆర్‌వోఆర్), ఖాళీలు, అర్హతలపై నెలకొన్న విబేధాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకొనేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. కోర్టుల్లో కేసులు, వివాదాల కారణంగా అర్హులైన అధికారులు పదోన్నతులు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.74 ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా సీనియారిటీ జాబితాపై కొంతమంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలపై సమావేశంలో డీజీపీ సమీక్షించారు. రెండు దశల్లో పదోన్నతులు కల్పించాలని యోచిస్తున్నారు.
తొలిదశలో 54 మందికి ప్రమోషన్లు
మొదటి దశలో 54 మంది డీఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారులకు అడీషనల్ ఎస్పీలు/అదనపు డీసీపీలుగా పదోన్నతులు కల్పించేందుకు పోస్టులు అందుబాటులో ఉన్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వివరించారు. రెండోదశలో వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రతిపాదిత జాబితాల ప్రకారం ముందుకు వెళ్లేందుకు ఆయా బ్యాచ్‌లకు సంబంధించిన అధికారులు అంగీకరించారు.
అలానే 12 నాన్‌కేడర్ ఎస్పీ పోస్టులపై న్యాయపరమైన వివాదాలేవీ లేనందువల్ల వాటిని తక్షణమే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వీటితోపాటు ప్యానల్ ఇయర్‌లో మరో 10 నాన్‌కేడర్ ఎస్పీ పోస్టులు కేటాయించనున్నట్లు వివరించారు. సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పోలీసు అధికారుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేస్తానని డీజీపీ తెలిపారు. సమావేశంలో మహిళా భద్రత విభాగం డీజీ సౌమ్యమిశ్రా, హైదరాబాద్ సీపీ మహేశ్‌భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
డీజీపీ సీవీ ఆనంద్ ఇప్పటికే పలుమార్లు 1995, 96 బ్యాచ్‌ల అధికారులతో సమావేశం నిర్వహించారు. వివాదం కొనసాగుతున్నంత కాలం పదోన్నతులు జరగకపోతే అందరికీ అన్యాయం జరుగుతుందని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు. దీంతో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యగా పరిష్కారం లభించనుంది.
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ – వయో పరిమితి మరో మూడేళ్లు పెంపు
పోలీసు శాఖలో భారీ మార్పులు – కొలిక్కి వస్తున్న డీఎస్పీ ఆపై స్థాయి పదోన్నతులు












