Homeఆంధ్రప్రదేశ్కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: వైఎస్సార్‌సీపీ నేతలు

కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: వైఎస్సార్‌సీపీ నేతలు

YSRCP leaders addressing media after meeting the State Election Commissioner in Vijayawada over alleged panchayat election irregularities

విజయవాడ | వారధి న్యూస్:రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. నామినేషన్ల దాఖలు నుంచి ఉపసంహరణ, స్క్రూటినీ వరకు తమ పార్టీ మద్దతుదారులకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

సోమవారం విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు, మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలో చోటుచేసుకున్నాయని పేర్కొంటున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

పల్నాడు, కడప, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో తమ పార్టీ మద్దతు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, పోలీసుల అండతో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ, డిక్లరేషన్ ఫామ్‌లో తాళిబొట్టు వివరాల పేరుతో నామినేషన్ల తిరస్కరణ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటివరకు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం నుంచి తగిన స్పందన లేదని విమర్శించారు. 2029లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వరుదు కళ్యాణి: అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు

అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులపై దాడులు చేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కల్పలతా రెడ్డి: తాళిబొట్టు వివరాల పేరుతో నామినేషన్ల తిరస్కరణ సిగ్గుచేటు

ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి విమర్శించారు. తమ అభ్యర్థులపై దాడులు చేయడంతో పాటు నామినేషన్ పత్రాలను చింపివేస్తున్న ఘటనలకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల కమిషనర్‌కు చూపించామని తెలిపారు. డిక్లరేషన్ ఫామ్‌లో తాళిబొట్టు బరువు, ధర వివరాలు లేవనే కారణంతో నామినేషన్ తిరస్కరించడం అన్యాయమని పేర్కొన్నారు. తమ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

మలసాని మనోహర్ రెడ్డి: ఏకగ్రీవాల పేరుతో అధికార దుర్వినియోగం

ఎన్నికల నిర్వహణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకు ప్రతిపక్ష అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను ఉపయోగించుకుని ఏకగ్రీవాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నలమారు చంద్రశేఖర్ రెడ్డి: వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా స్పందన లేదు

ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసినా సరైన స్పందన లేదని పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుని ఏకగ్రీవాలు ప్రకటించుకోవడాన్ని ప్రజాస్వామ్య విజయం అనలేమని పేర్కొన్నారు. దాడులు, బెదిరింపులతో జరిగే ఎన్నికలను స్వేచ్ఛాయుత ఎన్నికలుగా పరిగణించలేమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి, బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine