కత్తులు, తల్వార్లతో మెడ, ముఖంపై దాడి.. ఆసుపత్రికి తరలింపు

రాజేంద్రనగర్ | వారధి న్యూస్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మాజీ రౌడీషీటర్ మూర్తుజా అలియాస్ మూర్తుజ పైల్వాన్పై గుర్తుతెలియని దుండగులు కత్తులు, తల్వార్లతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. పాత కక్షలు, ప్రత్యర్థుల మధ్య ఆధిపత్య పోరే ఈ దాడికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం ప్రకారం.. దుండగులు మూర్తుజా అలీని లక్ష్యంగా చేసుకుని మెడ, ముఖంపై పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే అత్తాపూర్లోని జర్మన్టెన్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం వెలువడింది. దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
దాడి విషయం తెలుసుకున్న మూర్తుజా అలీ అనుచరులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
మూర్తుజా అలీపై గతంలో పలు హత్య కేసులు నమోదైనట్లు సమాచారం. 2015లో మీరాలం ట్యాంక్ వద్ద జరిగిన అసద్ హత్య కేసులోనూ ఆయన పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా 2021లో ఆయన హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా జరిగిన దాడి వెనుక పాత కక్షలా? ప్రత్యర్థుల మధ్య ఆధిపత్య పోరా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణాల్లో చర్చ జరుగుతోంది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఘటన వెనుక అసలు కారణాలేమిటనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.











