
అచ్చంపేట | వారధి న్యూస్:నల్లమల్ల అడవుల్లో వెలసిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం మద్దిమడుగులో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ కార్యక్రమానికి హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు చౌట గణేష్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల్ల ప్రాంతానికి చెందినవాడినని, ఈ ప్రాంతం తన సొంత ప్రాంతమని చెబుతున్నారని గుర్తుచేసిన ఆయన.. మరి నల్లమల్ల అభివృద్ధికి, అచ్చంపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లు గడుస్తున్నా కృష్ణానది తీరంలోని ఉమ్మడి అమ్రాబాద్ మండల ప్రజలకు తాగునీరు, సాగునీటి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లమల్ల అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీ, గిరిజన, దళిత కుటుంబాలు కనీస రహదారి, రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సరైన రోడ్లు లేక కొన్ని గూడాల ప్రజలు అత్యవసర పనుల కోసం కూడా కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని పేర్కొన్నారు.
నల్లమల్ల అభివృద్ధికి ఆరు ప్రధాన డిమాండ్లు
నల్లమల్ల ప్రాంత ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చౌట గణేష్ డిమాండ్ చేశారు.
- నల్లమల్లలోని ప్రతి గూడానికి రహదారి సౌకర్యం కల్పించాలి.
- ప్రతి గ్రామానికి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలి.
- మద్దిమడుగు వరకు ఉన్న రహదారిని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలి.
- మద్దిమడుగు–మాచర్ల మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మించాలి.
- ఉమ్మడి అమ్రాబాద్ మండల రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
- ఆదివాసీ, గిరిజన, దళిత గూడాల్లో తాగునీరు, రోడ్లు, రవాణా తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి.
భూమిపూజతో పాటు ప్రజల కష్టాలనూ గుర్తించాలి
మద్దిమడుగు పుణ్యక్షేత్రంలో భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావడం సంతోషకరమైన విషయమేనని, అయితే నల్లమల్ల ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడం కూడా అంతే ముఖ్యమని చౌట గణేష్ అన్నారు.
నల్లమల్లను తన సొంత ప్రాంతంగా భావిస్తున్న ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజల కష్టాలను కూడా తనవిగా భావించి పరిష్కరించాలని కోరారు. కేవలం మాటలు, హామీలతో సరిపెట్టకుండా తమ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు.
నల్లమల్లలోని ప్రతి గూడానికి రోడ్డు, ప్రతి గ్రామానికి బస్సు, రైతులకు సాగునీరు, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చౌట గణేష్ పేర్కొన్నారు.
జై నల్లమల్ల! జై అచ్చంపేట!













