Homeభక్తి/ఆధ్యాత్మికంశ్రీశైలంలో రేపు కోటి దీపోత్సవం.. భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు

శ్రీశైలంలో రేపు కోటి దీపోత్సవం.. భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు

Koti Deepotsavam celebrations at Srisailam temple

శ్రీశైలం | వారధి న్యూస్: కార్తీకమాసోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో నవంబర్ 20న కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

ఆగమ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు. దీపోత్సవానికి అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చనుంది.

సాయంత్రం 5 గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు

కోటి దీపోత్సవానికి ముందు సాయంత్రం 5 గంటల నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో (నాగూరుబాబు), ఆయన బృందంతో భక్తి సంగీత స్వరార్చన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ గాయనీగాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

స్వామి అమ్మవార్లకు విశేష పూజలు.. దశహారతులు

కోటి దీపోత్సవ ప్రత్యేక వేదికపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహహారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి రూపంలో దశహారతులు సమర్పించనున్నారు.

చివరగా మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనంతో కార్యక్రమాన్ని ముగించనున్నారు.

దీపారాధనతో సకల శుభాలు

ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. వైదిక సంప్రదాయంలో దీపానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని తెలిపారు. దీపజ్యోతిని యజ్ఞాగ్నికి సంకేతంగా భావిస్తారని, ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకే కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దీపం జ్ఞానం, వెలుగు, ఉత్సాహం, ఆనందం, శాంతికి ప్రతీక అని తెలిపారు. దీపారాధనతో దైవానుగ్రహం, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు.

కావున భక్తులు పెద్ద సంఖ్యలో కోటి దీపోత్సవానికి హాజరై శ్రీశైల మల్లికార్జున స్వామివారు, భ్రమరాంబ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, ఈవో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine