ఎనిమిది మంది అరెస్ట్.. నలుగురు పరారీ
మిరపపొడి చల్లి.. వేట కొడవలితో దాడి.. ఇనుప కడాయితో తలపై మోది హత్య

హైదరాబాద్ | నాగోల్ | వారధి న్యూస్ |: నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహ్మద్ నయీమ్ హత్య కేసును ఎస్ఓటీ ఎల్బీనగర్, నాగోల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్లోని మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజీవ్ గృహకల్ప, బండ్లగూడకు చెందిన మహ్మద్ నయీమ్ (31) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో కొందరు నిందితులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ముందుగా నయీమ్ కళ్లలో మిరపపొడి చల్లి, అతడిని వెంబడించారు. అనంతరం వేట కొడవలితో తల, కుడి చేతిపై దాడి చేశారు. ఆపై ఇనుప కడాయితో తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నయీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నయీమ్, ఓట్ల దినకర్, కనకం ఉమామహేశ్ చిన్ననాటి స్నేహితులు. గతంలో పలు నేర కేసుల్లో జైలుకు వెళ్లిన సమయంలో సయ్యద్ రబ్బానీకి ఉమామహేశ్తో పరిచయం ఏర్పడింది. అనంతరం రబ్బానీకి నయీమ్, దినకర్‌లతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయి.
అయితే గత రెండు నెలలుగా నయీమ్, ఉమామహేశ్, రబ్బానీ, దినకర్‌ల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు పెరిగినట్లు దర్యాప్తులో తేలిందని కమిషనర్ సుమతి తెలిపారు. నయీమ్ తమను ఫోన్లో బెదిరించడం, దూషించడంతో పాటు సామాజిక మాధ్యమాలు, కుటుంబ సంబంధిత అంశాల విషయంలోనూ వివాదాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
నయీమ్‌ను అంతమొందించేందుకు ఉమామహేశ్, రబ్బానీ, దినకర్ కలిసి పథకం రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. రబ్బానీ తన మాజీ జైలు సహచరుడు రాసుమళ్ల సాకేత్‌ను సంప్రదించాడు. నయీమ్‌తో గతంలో ఉన్న విభేదాల కారణంగా సాకేత్ కూడా హత్యకు సహకరించేందుకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

సాకేత్ ఈ విషయాన్ని తన పరిచయస్తుడైన వొల్లిపొల్ల మహేశ్‌కు చెప్పగా, అతని ద్వారా అలకుంట వెంకట్, కొడిగంటి రాఘవేందర్, వల్లపుదాసు చరణ్‌గౌడ్, మహ్మద్ ఇస్మాయిల్ జాబీ తదితరులు ఈ పథకంలోకి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ నెల 13న రబ్బానీ, వొల్లిపొల్ల మహేశ్, రాఘవేందర్, వెంకట్, మహ్మద్ ఇస్మాయిల్ జాబీ ఎల్బీనగర్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఖమ్మం వెళ్లారు. అక్కడ దినకర్, బద్రుల్లా హుస్సేన్ అలియాస్ బద్రి, ఉమామహేశ్లను కలిశారు. బద్రి, ఉమామహేశ్ ఏర్పాటు చేసిన హోటల్లో రాత్రి బస చేసి హత్యను ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించినట్లు పోలీసులు తెలిపారు. దినకర్ టయోటా కారును ఏర్పాటు చేశాడు.
14న సాయంత్రం నాలుగు గంటల సమయంలో దినకర్, రబ్బానీ, వెంకట్, రాఘవేందర్, మహ్మద్ ఇస్మాయిల్ జాబీ ఎల్బీనగర్కు చేరుకున్నారు. బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్ సమీపంలో రాసుమళ్ల సాకేత్, చరణ్‌గౌడ్, కార్తీక్‌లను కలిశారు. రెండు ద్విచక్ర వాహనాలు, టయోటా కారుతో అక్కడ మాటువేశారు.
నయీమ్ సుప్రీమ్ వైన్స్ వద్ద ఉన్నాడన్న సమాచారాన్ని భోలే ద్వారా తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భోలేకు నయీమ్‌తో ఉన్న తొడేటి వెంకటేశ్ ద్వారా సమాచారం అందినట్లు వెల్లడించారు. అనంతరం నయీమ్‌ను అడ్డగించి కళ్లలో మిరపపొడి చల్లి వెంబడించి, వేట కొడవలితో దాడి చేసి, ఇనుప కడాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో సయ్యద్ రబ్బానీ (21), ఒట్ల దినకర్ (35), వొల్లిపొల్ల మహేశ్ (23), రాసుమళ్ల సాకేత్ (26), అలకుంట వెంకట్ (22), కొడిగంటి రాఘవేందర్ అలియాస్ రఘు (27), వల్లపుదాసు చరణ్‌గౌడ్ (18), మహ్మద్ బద్రుల్లా హుస్సేన్ అలియాస్ బద్రి (44)లను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కనకం ఉమామహేశ్ (32)తో పాటు మహ్మద్ ఇస్మాయిల్ జాబీ, భోలే, కార్తీక్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవలి, ఇనుప కడాయి, సుత్తితో పాటు టయోటా కారు (AP40HM4669), గ్లామర్ ద్విచక్ర వాహనం (TS28H3703), సుజుకీ యాక్సెస్ (TG10D0282)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు నయీమ్ ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది, హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్ పోలీస్స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేయడం, దందాలు, ఇతర అక్రమ, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లు, అలవాటైన నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సుమతి తెలిపారు. వారిపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు అవసరమైన చోట ముందస్తు చర్యలు, చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
కేసును అతి తక్కువ సమయంలోనే ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ అభినందించారు. కేసు దర్యాప్తులో సమన్వయంతో పనిచేసిన ఎస్ఓటీ, నాగోల్ పోలీసులను ప్రత్యేకంగా ప్రశంసించారు








