రూ.25.41 కోట్లతో పునరాభివృద్ధి పనులు
ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు.. శరవేగంగా కొనసాగుతున్న పనులు

సికింద్రాబాద్, వారధి న్యూస్:ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సులభమైన రాకపోకలు, అధునాతన వసతులు కల్పించే లక్ష్యంతో ఖమ్మం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏబీఎస్ఎస్) కింద దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఖమ్మం రైల్వే స్టేషన్‌ను రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారు. పనులు తుది దశకు చేరుకుంటుండటంతో స్టేషన్ త్వరలో ఆధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకోనుంది.
దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద తెలంగాణలో రూ.2,000 కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలోని స్టేషన్ల పునరాభివృద్ధి ప్రాజెక్టులకు 2023 ఆగస్టు, 2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు.

కాజీపేట–విజయవాడ రైల్వే సెక్షన్లో ఉన్న ఖమ్మం రైల్వే స్టేషన్‌ను నాన్-సబర్బన్ గ్రేడ్-3 స్టేషన్‌గా వర్గీకరించారు. ఈ స్టేషన్ ద్వారా రోజుకు సగటున 20 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 55 రైళ్లు ఖమ్మం స్టేషన్లో నిలుస్తాయి. న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లకు కూడా ఇక్కడ హాల్ట్ సౌకర్యం ఉంది.
ప్రయాణికుల సౌకర్యం, సౌలభ్యాన్ని పెంచేలా స్టేషన్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పాదచారుల వంతెన, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారాలు, విశ్రాంతి గదులు, ఆర్పీఎఫ్ గదులు, ఏసీ లాంజ్ తదితర సౌకర్యాల అభివృద్ధి పనుల్లో పలు ఇప్పటికే పూర్తయ్యాయి.
మరోవైపు నూతన స్టేషన్ భవన నిర్మాణం, స్టేషన్ ప్రాంగణంలో పచ్చదనం పెంపు, స్టేషన్ ఆవరణ అభివృద్ధి, ముఖభాగాన్ని ఆధునికంగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఢిల్లీ–చెన్నై, హైదరాబాద్–విజయవాడ రైల్వే మార్గాల కూడలిలో ఖమ్మం రైల్వే స్టేషన్ కీలక ప్రాంతంలో ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య రైళ్ల రాకపోకలకు ఈ స్టేషన్ ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉండటంతోపాటు అనేక విద్యాసంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు నిలయంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న పలు పట్టణాలు, గ్రామాలకు కూడా ఖమ్మం ప్రధాన రవాణా కేంద్రంగా కొనసాగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటైన ఖమ్మం స్టేషన్ పునరాభివృద్ధితో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సులభతరమైన రాకపోకలు, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందనున్నాయి. స్టేషన్ ఆధునికీకరణతో స్థానికంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుని ఖమ్మం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.













