
హైదరాబాద్ | వారధి న్యూస్: ప్రభుత్వ కార్యాలయాలకు తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం కోసం వచ్చే సామాన్య ప్రజలకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. విధులు నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు వరుసగా దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకుంటున్నప్పటికీ, అవినీతి ఘటనలు పూర్తిగా ఆగడం లేదు.
ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అధికారులే లంచాలకు డిమాండ్..
తాజాగా హైదరాబాద్‌లోని గాంధీనగర్ ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించారు. ఈ దాడిలో విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీసర్ సంతోష్ ఆనంద్ రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఒక హైకోర్టు ఉద్యోగి నుంచి రూ.30 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లంచాలు డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ప్రజలకు సేవలు అందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు పాల్పడితే సామాన్యుడికి న్యాయం జరిగేదెలా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది.














