
జోగులాంబ గద్వాల జిల్లాలో 11 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు | ఉచిత సేవలు అందుబాటులో | 2 వేల కేసులు గుర్తింపు
గద్వాల | వారధి న్యూస్ ప్రతినిధి: పి. నాగరాజు | సెప్టెంబర్ 29: కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో రాజీకి అవకాశం ఉన్న కక్షిదారులు మధ్యవర్తిత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి. నిష్కా పత్రుడు సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను త్వరగా పరిష్కరించుకోవడంతో పాటు కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సత్సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంటుందని తెలిపారు.
అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న మధ్యవర్తిత్వ 3.0
కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న మధ్యవర్తిత్వ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కోర్టు హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యవర్తిత్వం ద్వారా కేసులను ఎలా పరిష్కరించుకోవచ్చు, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, అనుసరించాల్సిన విధానాలపై జి. నిష్కా పత్రుడు వివరించారు.
తటస్థ వ్యక్తి ద్వారా పరిష్కారం
సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 కింద ఉన్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల్లో మధ్యవర్తిత్వం ఒకటని ఆమె తెలిపారు. కోర్టు విచారణ తరహాలో కాకుండా, ఇరుపక్షాల మధ్య చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనే విధానమే మధ్యవర్తిత్వమని వివరించారు.
మధ్యవర్తిత్వ ప్రక్రియలో నియమితులైన మధ్యవర్తి పూర్తిగా తటస్థంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇరుపక్షాలతో విడివిడిగా, అవసరమైన సందర్భాల్లో కలిసి మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుంటారని చెప్పారు. ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా మధ్యవర్తి సహకరిస్తారని చెప్పారు. అయితే మధ్యవర్తి ఎలాంటి తీర్పు ఇవ్వడం లేదా ఒక పక్షంపై తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దడం జరగదని స్పష్టం చేశారు. తుది పరిష్కారం ఇరుపక్షాల అంగీకారంతోనే జరుగుతుందని అన్నారు.
11 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం 11 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు అందుబాటులో ఉన్నారని జి. నిష్కా పత్రుడు వెల్లడించారు. రాజీకి అవకాశం ఉన్న వివిధ రకాల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు.
మధ్యవర్తిత్వం చేసే సేవలు
వైవాహిక వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, భూ వివాదాలు, డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమస్యలు, వ్యాపార వివాదాలు తదితర కేసుల్లో మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని తెలిపారు. కోర్టులో కేసు కొనసాగుతున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోరవచ్చన్నారు.
ఇరుపక్షాల అంగీకారమే కీలకం
రాజీకి అవకాశం ఉన్న కేసులను న్యాయమూర్తి కూడా మధ్యవర్తిత్వానికి పంపవచ్చని తెలిపారు. అలాగే కక్షిదారులు తమ సమస్యను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలనుకుంటే స్వయంగా కూడా మధ్యవర్తిత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నిబంధనల ప్రకారం మధ్యవర్తిని నియమించి, ఇరుపక్షాలతో చర్చలు జరిపి పరిష్కారానికి మార్గం చూపుతామని చెప్పారు.
మధ్యవర్తిత్వ సమయంలో ఇరుపక్షాలు వెల్లడించిన విషయాలకు గోప్యత ఉంటుందని ఆమె తెలిపారు. అక్కడ వెల్లడించిన సమాచారాన్ని తరువాత ఒక పక్షానికి వ్యతిరేకంగా ఉపయోగించలేరని స్పష్టం చేశారు. దీంతో కక్షిదారులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ సమస్యలను మధ్యవర్తి ముందు స్వేచ్ఛగా వివరించవచ్చన్నారు.
గద్వాల జిల్లాలో 2 వేల కేసులు గుర్తింపు
జిల్లాలో ఇప్పటివరకు సుమారు 2,000 కేసులను మధ్యవర్తిత్వానికి అనుకూలమైనవిగా గుర్తించినట్లు జి. నిష్కా పత్రుడు తెలిపారు. వీటిలో 148 కేసులను ఇప్పటికే న్యాయమూర్తికి పంపించినట్లు వెల్లడించారు. రానున్న మూడు నెలల ప్రచార కార్యక్రమంలో మరిన్ని కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సుదీర్ఘ న్యాయ ప్రక్రియతో పోలిస్తే సమయం, ఖర్చు తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కుటుంబ, ఆస్తి, వ్యాపార సంబంధిత వివాదాల్లో ఇరుపక్షాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినకుండా పరిష్కారం ఉంటుందని వివరించారు.
జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల్లో రాజీకి అవకాశం ఉన్నప్పుడు మధ్యవర్తిత్వాన్ని ఒక ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా పరిగణించాలని జి. నిష్కా పత్రుడు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత మధ్యవర్తిత్వ సేవలను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.













