
రూ.11.28 లక్షల అద్దె సొమ్ము మున్సిపల్ ఖాతాలో జమ చేయకపోవడంపై కలెక్టర్ చర్యలు
గద్వాల | వారధి న్యూస్ | సెప్టెంబర్ 29:గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్ షాపుల అద్దెలకు సంబంధించిన రూ.11.28 లక్షల సొమ్మును మున్సిపల్ ఖాతాలో జమ చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణించిన కలెక్టర్ సంబంధిత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్, ఇన్‌చార్జ్ షరాఫ్ రాజవర్ధన్ నాయుడులను సస్పెండ్ చేశారు. టీ. రాజేష్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్‌ను కూడా విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సమగ్ర విచారణకు ఆదేశాలు
అద్దె సొమ్ము జమ చేయకపోవడానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు.
సంబంధిత రశీదు పుస్తకాలు, మున్సిపల్ రికార్డులు, సొమ్ము జమ చేసిన వివరాలు (రిమిటెన్స్) తదితర పత్రాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించారు.
మున్సిపల్ షాపుల అద్దెల వసూళ్లు, వాటి జమకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.














