
సిరిసిల్ల | వారధి న్యూస్ | పి. నాగరాజు | సెప్టెంబర్ 30: సిరిసిల్లలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్ల రాజకీయ పరిస్థితులు, చేనేత రంగం, గల్ఫ్ వలసలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో గజ్వేల్‌లో చెప్పినట్లుగానే.. ఇప్పుడు సిరిసిల్లలోనూ రాజకీయంగా మార్పు తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
చేనేతకు ప్రత్యేక గుర్తింపు
సిరిసిల్ల చేనేత రంగానికి ఎంతో పేరుందని రేవంత్ రెడ్డి అన్నారు. స్థానిక నేత కార్మికులు తమ నైపుణ్యంతో తెలంగాణకు దేశ, విదేశాల్లో గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర వంటి వినూత్న ఉత్పత్తులు తయారు చేసి సిరిసిల్ల పేరు ప్రపంచానికి చాటారని చెప్పారు.
‘సిరసాల’ అనే పేరు నుంచి ‘సిరిసిల్ల’ అనే పేరు వచ్చిందని సీఎం ప్రస్తావించారు. సిరసాల అంటే సిరులకు నిలయం అనే అర్థం వస్తుందని వివరించారు. ఇలాంటి ప్రత్యేక చరిత్ర ఉన్న ప్రాంతం గత పాలనలో అనేక సమస్యలను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. ధైర్యం, దైవం కలగలిసిన ప్రాంతంగా సిరిసిల్లకు ప్రత్యేకత ఉందన్నారు.
అయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరులకు నిలయంగా పేరొందిన సిరిసిల్ల ‘ఉరిసిల్ల’గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. చేనేత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ పాలనపై ఆయన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ వారసత్వంపై విమర్శలు
గత పదేళ్ల పాలనలో సిరిసిల్ల పరిస్థితి దారుణంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చేనేత కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వ విధానాలను విమర్శించారు.
2009 ఎన్నికల సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మహేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అమెరికా నుంచి కొడుకును తీసుకొచ్చి పోటీ చేయించారని, తక్కువ ఓట్ల తేడాతో బయటపడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గురించి, తన గురించి కేటీఆర్‌కు పూర్తిగా తెలియదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను అడిగితే కాంగ్రెస్ పార్టీ గురించి, తన గురించి చెబుతారని అన్నారు.
గల్ఫ్ వలసలపై కేసీఆర్‌ను ప్రశ్నించిన సీఎం
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో కార్మికులు వలస వెళ్లాల్సిన పరిస్థితిపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గల్ఫ్ వలసలను ఎందుకు అరికట్టలేకపోయారని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు.
గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన కార్మికులు మరణించిన సందర్భాల్లో వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో గత ప్రభుత్వం తగిన సహకారం అందించలేదని ఆరోపించారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
గజ్వేల్‌లో చేసి చూపించాం.. ఇప్పుడు సిరిసిల్లపై గురి’
గతంలో గజ్వేల్‌లో చేసిన రాజకీయ పోరాటాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సిరిసిల్లపై దృష్టి పెట్టామని అన్నారు. ‘‘ఈసారి సిరిసిల్ల గడీల మీద గురి పెడతాం.. ఈ గడీని నేలమట్టం చేస్తాం’’ అని సభలో వ్యాఖ్యానించారు.
సిరిసిల్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.
ఇప్పుడు సిరిసిల్ల గడీలపై గురి పెడతామని సీఎం వ్యాఖ్యానించారు. “ఈసారి సిరిసిల్ల గడీల మీద గురి పెడతాం.. ఈ గడీని నేలమట్టం చేస్తాం” అని రేవంత్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్లపై రాజకీయ దృష్టి
సిరిసిల్ల నియోజకవర్గం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మంత్రివర్గంలో చోటు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న రాజకీయ ప్రాధాన్యతను సీఎం తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేస్తూ.. నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు..
సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, రాజకీయంగా పాగా వేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.














