
ఆయుధం లేదు.. గాయం లేదు.. రక్తపు చుక్క లేదు.. అయినా హత్యాయత్నం కేసా?: వైఎస్సార్సీపీ నేతల ఆక్షేపణ
ఆంధ్రప్రదేశ్ | తాడేపల్లి | వారధి న్యూస్:
· డీఎస్సీ అక్రమాలను ప్రశ్నించిన వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు
· రేపు (26వ తేదీ) విజయవాడ సీపీని కలిసి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం
:పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతల వెల్లడి
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. పార్టీ నాయకులపై అక్రమ కేసులు, అరెస్టుల వ్యవహారంపై సమావేశంలో చర్చించారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని వెంకట్రామయ్య (నాని), జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మురుగుడు హనుమంతరావు, యేసురత్నం, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్‌బాబు, స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అంబటి మురళి, డైమాండ్ బాబు, వరికూటి అశోక్‌బాబు, నూరి ఫాతిమా, వడ్డీ రఘురాం, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శులు పూడి శ్రీహరి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో చోటుచేసుకున్న అక్రమాలపై ఆధారాలతో ప్రశ్నిస్తున్న వైయస్ఆర్సీపీ నేతల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం పోలీసు కేసులను అడ్డుపెట్టుకుంటోందని సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు మండిపడ్డారు. డీఎస్సీ వ్యవహారంపై సమాధానం చెప్పకుండా నిరసనకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేసి, అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేస్తున్నారని వారు ఆక్షేపించారు. శాంతియుత నిరసనకు ఐదు రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా కేసులు నమోదు చేయడం, ‘ఇతరులు’ పేరుతో మరింత మందిని కేసుల్లోకి లాగే ప్రయత్నం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
ఆయుధం, గాయం లేకపోయినా సెక్షన్–307 కింద హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేశారని పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు గట్టిగా నిలదీశారు. మఫ్టీలో వచ్చి అరెస్టులు చేయడం, కుటుంబాలను భయపెట్టడం చట్టబద్ధం కాదని వారు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై రేపు (26వ తేదీ, శనివారం) విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని వెల్లడించారు.
ఈ ప్రెస్మీట్లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..:
అసలు ఆ కేసులకు ఆధారాలు ఎక్కడ?
:అంబటి రాంబాబు. మాజీ మంత్రి.
– అసలు మా మీద సెక్షన్–307 కింద హత్యాయత్నంతో పాటు, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టారు? ఎవరినైనా కులం పేరుతో దూషించామా? ఎవరినైనా చంపేందుకు ప్రయత్నించామా? లేదు కదా?. ఆయుధం లేదు.. కర్ర లేదు.. గాయం లేదు.. రక్తపు చుక్క లేదు.. అయినా సెక్షన్–307 ఎలా పెడతారు? అర్ధరాత్రి మఫ్టీలో వచ్చి నాయకులను అరెస్టు చేయడం, ఇళ్ల చుట్టూ తిరిగి భార్యాపిల్లలను భయపెట్టడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కేసులు పెట్టాలనుకుంటే అందరిపై పెట్టండి.. మేమంతా వస్తాం. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచండి. చట్ట ప్రకారం బెయిల్ తీసుకుంటాం. రాత్రిపూట అరెస్టులు, మఫ్టీలో తీసుకెళ్లడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
డీఎస్సీ అక్రమాలను పక్కదారి పట్టించే ప్రయత్నం:
డీఎస్సీ అక్రమాలపై మేము శాంతియుతంగా నిరసనకు వచ్చాం. ఐదు రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం. అయినా మాపై కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లలో ‘వైయస్ఆర్సీపీ సానుభూతిపరులు’, ‘ఇతరులు’ అంటూ ఎవరినైనా కేసుల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బయట ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ కేసులు పెడుతున్నారు. రేపు (26వ తేదీ, శనివారం) అందుబాటులో ఉన్న వైయస్ఆర్సీపీ నాయకులందరం విజయవాడ సీపీని కలిసి పూర్తి వివరాలతో వినతిపత్రం ఇస్తాం. ఇంకా మా పార్టీ నాయకుడు కాకుమాను రాజశేఖర్ మృతి ఘటనపై కూడా చర్యలు తీసుకోవాలి. ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా దీటుగా ఎదుర్కొంటాం.

తప్పుడు కేసులకు భయపడం. రెట్టింపు పౌరుషంతో పని చేస్తాం.
:వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి.
– డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు శాంతియుతంగా వెళ్లిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై సెక్షన్–307తో పాటు, ఎస్సీ–ఎస్టీ తదితర కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒకే చోట ఉన్న టీడీపీకి చెందిన వారిపై కేసులు లేకుండా, వైయస్ఆర్సీపీ వారిపైనే సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? రాత్రివేళ ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం, గంటల తరబడి స్టేషన్లో ఇబ్బందులకు గురి చేయడం సరి కాదు. పార్టీ లీగల్ టీమ్ ద్వారా తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం. నారా లోకేష్, హోంమంత్రి సహా కూటమి నేతలు వైయస్ఆర్సీపీ నాయకులపై కేసులు, రౌడీషీట్ల పేరుతో చేస్తున్న చర్యలకు భయపడేది లేదు. కేసులు ఎన్ని పెట్టినా వైయస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు. రెడ్‌బుక్ తరహా చర్యలతో పార్టీని అణచివేయాలని చూస్తే ప్రజల తరఫున రెట్టింపు పౌరుషంతో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.
‘అదర్స్’ పేరుతో మరింత మందిని కేసుల్లోకి లాగే ప్రయత్నం.
:మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ
– డీఎస్సీ ధర్నాలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని సెక్షన్–307తో పాటు, ఎస్సీ–ఎస్టీ తదితర కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో యాక్టివ్‌గా ఉన్న నాయకులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చురుకుగా ఉండాలనుకునే వారిని టార్గెట్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో నాలుగైదు పేర్లు పెట్టి ‘అదర్స్’ పేరుతో మరింత మందిని కేసుల్లోకి లాగే ప్రయత్నం జరుగుతోంది. 21వ తేదీ ధర్నా అనంతరం విజయవాడ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి అరెస్టులకు ప్రయత్నిస్తున్న ఈ చర్యలపై వైయస్ఆర్సీపీ భయపడేది లేదు.
ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం మంచిది కాదు.
:లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీ.
– డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై వైయస్ఆర్సీపీ ఆధారాలతో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు, అర్ధరాత్రి అరెస్టులతో నాయకులు, కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 21వ తేదీ శాప్ కార్యాలయం వద్ద నిరసనకు ఐదు రోజుల ముందే పోలీసులకు అనుమతి లేఖ ఇచ్చాం. అయినా శాంతియుత నిరసనను అడ్డుకుని సెక్షన–307తో పాటు, ఎస్సీ–ఎస్టీ కేసులు పెట్టారు. అదే సమయంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి టెంట్లు, కుర్చీలు, మైకులు, డీజేలు ఏర్పాటు చేసి నిరసనకు అవకాశం కల్పించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా, నకిలీ సర్టిఫికెట్లు, ఉద్యోగాల ఎంపికలో అక్రమాలు, బేరసారాలకు సంబంధించిన అంశాలపై మేము ఆధారాలతో ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. చట్టాలను, ఎస్సీ–ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వైయస్ఆర్సీపీ భయపడేది లేదు. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రజల తరఫున ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
డీఎస్సీ అక్రమాలపై సమాచారం ఇస్తామంటే అనుమతి నిరాకరణ ఎందుకు?.
:మల్లాది విష్ణు. మాజీ ఎమ్మెల్యే.
– డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించేందుకు 21వ తేదీన శాప్ కార్యాలయానికి వస్తామని వైయస్ఆర్సీపీ ముందుగానే పోలీసులకు తెలిపి, అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అయినా విజయవాడ నగరంలో 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయంటూ అనుమతి నిరాకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మా హక్కు. మరి వైయస్ఆర్సీపీ వస్తుందని ముందే తెలిసినప్పటికీ శాప్ కార్యాలయంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన టీచర్లు, టీడీపీకి సంబంధించిన సమూహాన్ని ఎందుకు అనుమతించారు? మాకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు వారికి ఎలా అవకాశం కల్పించారో సమాధానం చెప్పాలి. ప్రజల తరఫున ప్రశ్నిస్తే ఒక న్యాయం, అధికార పక్షానికి మరో న్యాయమా?. ఈ వ్యవహారంపై పోలీసుల తీరుకు స్పష్టత ఇవ్వాలి.
శాప్ ఆఫీస్ వద్ద చేసిన దాడికి సమాధానం చెప్పాలి.
:షేక్ నూరి ఫాతిమా. పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు.
– బందర్ రోడ్డులో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసనకు వస్తుంటే పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. ముఖ్యంగా వికలాంగులు నిరసనలో పాల్గొన్న సమయంలో వారి చేతుల్లోని కర్రలు తీసుకుని, వారిపై దాడి చేస్తున్న వారిని ఒక పోలీస్ కానిస్టేబుల్ అడ్డుకున్న వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలను పోలీసు ఉన్నతాధికారులు చూశారా? వాస్తవాలు తెలుసుకున్నారా? వైయస్ఆర్సీపీ బందర్ రోడ్డులో శాంతియుతంగా నిరసన తెలిపిన దృశ్యాలన్నీ వీడియోలతో సహా ఉన్నాయి. బీజేపీ, జనసేనకు వర్తించని ఆంక్షలు వైయస్ఆర్సీపీకే ఎందుకు వర్తిస్తున్నాయి? డీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించినవారికి, అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నవారికి అవకాశం ఇచ్చి, మాకు మాత్రం అడ్డంకులు సృష్టించడం ఏ న్యాయం? శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన మా నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగిన ఘటనలపై వాస్తవాలను బయటపెట్టాలి.

అక్రమ కేసులకు భయపడొద్దు. లీగల్ టీమ్ అండగా ఉంటుంది.
:పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగర్ విభాగం)
– దాడులు చేస్తామని, కొడతామని, చంపేస్తామని బహిరంగంగా వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా, మాపైనే కేసులు పెట్టడం అన్యాయం. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ, లీగల్ టీమ్, మా నాయకత్వం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాయి. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా సమర్థవంతంగా ఎదుర్కొంటాం.
పోలీసుల తోపులాట వల్లే కాకుమాను రాజశేఖర్ మృతి.
:టీజేఆర్ సుధాకర్‌బాబు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
– డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 382 ఉద్యోగాల్లో భారీగా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాలను శాప్ అధికారులకు అందించి, నకిలీ సర్టిఫికెట్లు ఉన్నవారిని తొలగించి అర్హులకు న్యాయం చేయాలని చెప్పేందుకే ఐదు రోజుల ముందే నోటీసు ఇచ్చి 21వ తేదీన శాప్ కార్యాలయానికి వచ్చాం. మేము యుద్ధానికి రాలేదు.. ఎవరితోనూ ఘర్షణకు రాలేదు. అయినా మమ్మల్ని గేట్ల వద్ద అడ్డుకుని, మరోవైపు డీఎస్సీ ఉద్యోగుల పేరుతో వచ్చిన వారికి టెంట్లు, మైకులు, డీజేలు ఏర్పాటు చేసి అవకాశం కల్పించారు. వికలాంగులపై దాడి జరిగిన దృశ్యాలు కూడా ఉన్నాయి. పోలీసుల తోపులాటలో కాకుమాను రాజశేఖర్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటనకు బాధ్యత వహించాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మాపైనే ఎస్సీ–ఎస్టీ కేసులతో పాటు, సెక్షన్–307 కింద కేసులు పెట్టడం ఏమిటి? డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పకుండా కేసులు, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే వైయస్ఆర్సీపీ వెనక్కి తగ్గదు.
అరెస్టులకు భయపడం. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.
:వరికూటి అశోక్‌బాబు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త.
– డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి, తిరిగి మాపైనే సెక్షన్–307తో పాటు, ఎస్సీ–ఎస్టీ కేసులు పెట్టడం ఏమిటి? దాడి చేశామని బహిరంగంగా చెప్పిన వారిపై చర్యలు తీసుకోకుండా, రాత్రివేళల్లో సామాన్య కార్యకర్తల ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టి భయపెట్టడం ఏ న్యాయం? పోలీసుల లాఠీ దాడుల్లో కార్యకర్తలు గాయపడటం, కాకుమాను రాజశేఖర్ మృతి చెందడం వంటి ఘటనలకు బాధ్యత ఎవరిది? వీడియో ఆధారాలతో పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నాం. చివరకు నాపైనా ఎస్సీ–ఎస్టీ కేసు పెట్టారు. అయితే మేము ఏ కేసులకూ భయపడబోము.













