
ప్రతి బూత్‌లో బీఎల్ఏలు అప్రమత్తంగా పనిచేయాలి: టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ | వారధి న్యూస్ : అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లు, కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మైసిగండి ఎంఆర్జీ ఫంక్షన్ హాల్లో కడ్తాల్ మండల బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లు, ఇన్చార్జీలు, కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లతో మాట్లాడి, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించేలా బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉన్నందున ప్రతి బూత్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో తొలి దశలో బూత్ స్థాయి ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేశారని, రెండో దశలోనూ అదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించాలని ఆయన కోరారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, గడువులోగా అధికారులకు సమర్పించేలా సహకరించాలని సూచించారు.
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేలా ఫారం ఆరు ద్వారా దరఖాస్తు చేయించాలని, అనర్హులైన ఓటర్లపై ఫారం ఏడు ద్వారా అభ్యంతరాలు తెలియజేయాలని తెలిపారు. ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే ఫారం ఎనిమిది ద్వారా సవరణలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చేగూరి వెంకటేష్, కడ్తాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుగంటి శంకర్, మాజీ మండల అధ్యక్షుడు సభావత్ విద్యానాయక్, సురేందర్ రెడ్డి, జవహర్లాల్ నాయక్, హీరాసింగ్ నాయక్, సత్యం గౌడ్, సుమన్, జగన్ నాయక్, సత్యనారాయణ, మహేష్, తులసీరామ్, రమేష్ గౌడ్, డాక్టర్ శ్రీను, సంతోష్, విక్రమ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.














