Homeతెలంగాణకోయిల్ సాగర్‌పై కుట్ర జరుగుతోంది.. కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి: ఆల వెంకటేశ్వర్ రెడ్డి

కోయిల్ సాగర్‌పై కుట్ర జరుగుతోంది.. కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి: ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Former MLA Ala Venkateshwar Reddy speaking about the Koilsagar project and opposing water diversion to Kodangal

భూత్పూర్ | వారధి న్యూస్ : కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు నీటిని తరలించే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కోయిల్ సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోందని తాము ముందుగానే హెచ్చరించామని ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. కోయిల్ సాగర్ నుంచి కొడంగల్‌కు నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందుంచామని పేర్కొన్నారు. సర్వే, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం శంకుస్థాపన చేసినప్పటికీ, అలాంటిదేమీ లేదంటూ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గతంలో బుకాయించారని విమర్శించారు.

కొడంగల్‌కు ఒక్క చుక్క నీరు కూడా పోనివ్వబోమని ప్రకటనలు చేసిన ఎమ్మెల్యే.. ఇప్పుడు పనులన్నీ పూర్తయ్యాక పాత జీవోను తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌కు నీటి తరలింపు అంశాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నారని అన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ కోసం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చామని, అయితే కోయిల్ సాగర్‌పై భారం పడకూడదనే ఉద్దేశంతో శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచే నీటిని తీసుకోవాలని నిర్ణయించామని వివరించారు. కోయిల్ సాగర్ నిండుగా ఉండాలనే ముందుచూపుతో కరివెన రిజర్వాయర్ నుంచి కెనాల్‌ను కూడా డిజైన్ చేశామని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత కారణంగా వర్షాకాలంలో పంటలకు సైతం నీరు అందించలేకపోయారని ఆల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేకు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే కొడంగల్‌కు నీటి తరలింపు ప్రాజెక్టు ముందుకు వెళ్లేది కాదని వ్యాఖ్యానించారు.

కోయిల్ సాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కోయిల్ సాగర్ రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నీటి హక్కుల కోసం ఉద్యమిస్తామని, కొడంగల్‌కు కోయిల్ సాగర్ నుంచి నీటి తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు.

మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్‌కు తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించుకోవాలని సూచించారు. అంతేకానీ కోయిల్ సాగర్‌కు నష్టం కలిగిస్తూ నీటిని తరలించవద్దని, ఆయకట్టు రైతుల పొట్ట కొట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine