
కరీంనగర్లో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభం.. రూ.944 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
కరీంనగర్ | వారధి న్యూస్ | పి. నాగరాజు | సెప్టెంబర్ 30:తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వంలోని 10.5 లక్షల మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తికాలపు ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది కూడా ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలు అందించడం ఎంతో శ్రమ, నిబద్ధతతో కూడుకున్న పని అని సీఎం పేర్కొన్నారు.
ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేసినప్పుడే పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సమర్థవంతంగా చేరుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పేదలకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వ కార్యాలయాలు

ప్రభుత్వ కార్యాలయాలు పేదలకు నమ్మకం, విశ్వాసం కలిగించేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యలు, బాధలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిరుపేదలను కుటుంబ సభ్యులుగా భావించి అధికారులు, ఉద్యోగులు సేవలందించాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులే కీలక ప్రతినిధులని చెప్పారు. ఉద్యోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా దాని వెనుక ఉద్యోగుల పనితీరు కూడా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు, శాసనాలు, అనుమతులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని సీఎం తెలిపారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా మొదటి తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రమోషన్లు, బదిలీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, ఇతర ప్రయోజనాలు, ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకు పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించామని చెప్పడం లేదని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందిస్తూనే ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు.
కరీంనగర్ అభివృద్ధికి రూ.944 కోట్ల పనులు
కరీంనగర్ జిల్లాలో రూ.944 కోట్ల విలువైన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్ల నిధులు సాధించామని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ముఖ్యమంత్రిగా నేను అభినందించడంలో ఎలాంటి సందేహాలు ఉండవని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసుకోవాలని, మిగిలిన సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్నారు .
కేంద్రంతో సమన్వయంతో అభివృద్ధి పనులు
వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవని సీఎం అన్నారు. అందుకే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు.
కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో కంటోన్మెంట్ ప్రాంతం అతిపెద్ద ప్రతిబంధకంగా ఉండేదని సీఎం వివరించారు. గతంలో పలువురు నాయకులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి సమస్యను వివరించానని చెప్పారు. ఆ తర్వాత ఆరు నెలల్లోనే కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 170 ఎకరాల భూమిని రాష్ట్రానికి అందించారని తెలిపారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు రూ.5 వేల కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి రహదారి నిర్మించేందుకు కూడా అనుమతులు సాధించామని వెల్లడించారు.
అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ సిద్ధాంతాలు వేరైనా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు.













