
వంగూరు | వారధి న్యూస్ | పి. నాగరాజు : మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నగదు కోసం వచ్చిన ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పటికీ నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో బ్యాంకులో నగదు లేదని, ‘లాకర్ కీ మర్చిపోయాం’ అని సిబ్బంది చెప్పినట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.
నగదు అవసరమైన వారు సమీపంలోని ప్రైవేట్ షాపుల ద్వారా డబ్బులు తీసుకోవాలని లేదా ఇతర ఖాతాలకు నగదు బదిలీ చేసుకోవాలని సిబ్బంది సూచించినట్లు వారు చెబుతున్నారు. ఖాతాల్లో డబ్బులు ఉన్నా.. వాటిని తీసుకునేందుకు బ్యాంకులో నగదు అందుబాటులో లేకపోవడంపై ఖాతాదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘లాకర్ కీ మర్చిపోయాం’ అని సిబ్బంది చెప్పడం ఎంతవరకు సమంజసమని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఖాతాదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, బ్యాంకు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అలాగే బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.70 వేలున్నా నగదు ఇవ్వలేదంటూ రైతు ఆవేదన
ఇదే సమయంలో మరో గ్రామానికి చెందిన ఓ రైతు తన భార్యతో కలిసి నగదు కోసం బ్యాంకుకు వచ్చినట్లు ఖాతాదారులు తెలిపారు. సదరు రైతు ఖాతాలో సుమారు రూ.70 వేల నగదు ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. బ్యాంకులో నగదు లేదని సిబ్బంది చెప్పడంతో రైతు దంపతులు నిరాశకు గురైనట్లు తెలిపారు.
ప్రైవేట్ షాపులపై ఖాతాదారుల అనుమానాలు
బ్యాంకులో నగదు అందుబాటులో లేదని చెబుతూ పక్కనే ఉన్న షాపుల నుంచి డబ్బులు తీసుకోవాలని సిబ్బంది సూచించడం వెనుక కారణమేంటని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులో ఖాతా ఉండి తమ డబ్బును తీసుకునేందుకు వచ్చిన వారిని ప్రైవేట్ వ్యక్తుల వద్దకు ఎందుకు పంపుతున్నారని నిలదీస్తున్నారు.
బ్యాంకు పరిధిలోని ప్రైవేట్ షాపుల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు అధికారికంగా ఏమైనా అనుమతులు ఉన్నాయా? అనే అంశంపై బ్యాంకు అధికారులు స్పష్టత ఇవ్వాలని ఖాతాదారులు కోరుతున్నారు.
బీసీలపై ఆరోపణలు.. రుణాల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులు
వంగూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తున్న బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీలు) రుణాలు ఇప్పించే విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కొందరు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. రూ.లక్ష రుణం మంజూరు చేయించేందుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అడుగుతున్నారని వారు పేర్కొన్నారు.
అదేవిధంగా బిజినెస్ కరస్పాండెంట్లను సంప్రదించకుండా నేరుగా రుణం పొందేందుకు ప్రయత్నించే ఖాతాదారులను సంతకాలు, పత్రాల పేరుతో బ్యాంకు చుట్టూ రోజుల తరబడి తిప్పుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. బీసీల ద్వారా రుణ ప్రక్రియ త్వరగా పూర్తవుతుండగా, నేరుగా బ్యాంకును ఆశ్రయించే ఖాతాదారులకు అదే ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోందని వారు ప్రశ్నిస్తున్నారు.
‘ఖాతాదారులకు కనీస గౌరవం ఇవ్వడం లేదు’
పోల్కంపల్లికి చెందిన నాగయ్య మాట్లాడుతూ.. వంగూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో సిబ్బంది సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖాతాదారులతో చిరాకుగా మాట్లాడుతున్నారని, నగదు అడిగితే ‘లాకర్ కీ మర్చిపోయాం.. పక్కనే ఉన్న షాపులో తీసుకోండి’ అంటూ సమాధానం ఇస్తున్నారని తెలిపారు.
ప్రైవేట్ వ్యక్తుల వద్ద నగదు తీసుకుంటే ప్రతి రూ.1,000కు రూ.10 వరకు కమిషన్ చెల్లించాల్సి వస్తోందని సాజిద్ పేర్కొన్నారు. బ్యాంకు సిబ్బంది తీరుతో ఖాతాదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్
ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతాలు నిర్వహిస్తున్న రైతులు, సామాన్య ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలపై బ్యాంకు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. బ్యాంకులో నగదు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు, ఖాతాదారులను ప్రైవేట్ షాపులకు పంపుతున్న వ్యవహారం, బిజినెస్ కరస్పాండెంట్లపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.














