
అచ్చంపేట | వారధి న్యూస్: రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రెండోసారి మహిళలకు చీరలను అందించనుంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు కలిపి మొత్తం కోటి చీరలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ఈ చీరలను రూపొందించారు. నాణ్యత, మన్నికకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక డిజైన్లతో పాటు సంప్రదాయ పద్ధతిలో ధరించేందుకు వీలుగా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు.
మొత్తం 6.30 మీటర్ల పొడవు కలిగిన 95 లక్షల పాలిస్టర్ చీరలు, 9 మీటర్ల పొడవు కలిగిన 5 లక్షల పాలీకాటన్ చీరలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నేత కార్మికులతోనే వీటిని తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఎవరికి అర్హత ఉంటుంది?
రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు ఈ చీరలను పొందేందుకు అర్హులు. లబ్ధిదారులు తమ ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలను చూపించి చీరలను తీసుకోవచ్చు.
జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్ సిబ్బంది చీరలను అందజేయనున్నారు. పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయనున్నారు.













