
తిరుపతి | వారధి న్యూస్:కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై జరిగిన దాడిని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు చోటు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ.. ఎంపీలకే రక్షణ లేని పరిస్థితి ఉంటే, రాష్ట్రంలో సామాన్య ప్రజల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు.
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులను బెదిరించడం, పెట్రోల్ బాంబులు, రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగాల్సిన సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల కోసం ఎంపీలు స్వయంగా వెళ్లాల్సిన పరిస్థితి రావడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి కూడా భయపడేలా పరిస్థితులు సృష్టించడం వారి ఎన్నికల హక్కులను హరించడమేనని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన ప్రజాస్వామ్య, పక్షపాతరహిత పాలనకు ప్రస్తుత పరిణామాలు విరుద్ధంగా ఉన్నాయని గురుమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
వైఎస్ అవినాష్‌రెడ్డిపై జరిగిన దాడితో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఎన్నికల హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించి, దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.














