Homeఆంధ్రప్రదేశ్స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు.. కూటమిపై తీవ్ర ఆరోపణలు...ఎస్ఈసీ కి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు.. కూటమిపై తీవ్ర ఆరోపణలు…ఎస్ఈసీ కి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

YSRCP leaders submitting a complaint to the State Election Commission over alleged irregularities in local elections and accusing the ruling coalition.

విజయవాడ | వారధి న్యూస్: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటం, నామినేషన్ల పరిశీలనలో చిన్నచిన్న కారణాలతో తిరస్కరించడం వంటి ఘటనలతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని విమర్శించారు.

ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారులను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

పులివెందుల, పిడుగురాళ్ల, చంద్రగిరి ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, కొందరిని హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ కేంద్రాల వద్ద దాడులు, బెదిరింపులు జరుగుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగి గెలవాల్సిన అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. ఎన్నికల అక్రమాలపై ప్రతిరోజూ ఫిర్యాదులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థికి తగిన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు దివ్యాంగ ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

YSRCP leaders addressing the media during a press meet after submitting a complaint to the State Election Commission (SEC) over alleged local election irregularities.

నామినేషన్ వేసే హక్కుకే ముప్పు: ఎంవీఎస్ నాగిరెడ్డి

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (రైతు విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. స్క్రూటినీ సమయంలో చిన్నచిన్న కారణాలు చూపుతూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.

రోజుకు 25 నుంచి 35 వరకు నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదులు అందిస్తున్నా ఆశించిన చర్యలు కనిపించడం లేదన్నారు. ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి, అభ్యర్థులందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలు ఇచ్చే తీర్పునకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

దాడులు, బెదిరింపులతో భయపెడుతున్నారు: రమేష్ యాదవ్

పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, తొండూరు మండలాల్లో నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. అభ్యర్థులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడిన వ్యక్తులు రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడుతున్నారని, ఈ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

ఫిర్యాదులు చేస్తున్నా మారని పరిస్థితి: నలమారు చంద్రశేఖర్‌రెడ్డి

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు ఒకటి నుంచి మూడు సార్లు ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదులు చేస్తున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదని పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

కడప, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. పిడుగురాళ్లలో ఓ ఎస్ఐ నామినేషన్ కేంద్రం తలుపులు మూసి అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపించారు. ఫిర్యాదులను కేవలం సంబంధిత అధికారులకు పంపించడంతో సరిపెట్టకుండా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు: కొమ్మూరి కనకారావు

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రారంభం నుంచే పలు ప్రాంతాల్లో అవకతవకలు జరుగుతున్నాయని పార్టీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆరోపించారు.

గ్రామాభివృద్ధి కోసం ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల మద్దతు కోల్పోతామనే భయంతోనే ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి అక్రమాలను అరికట్టాలని కోరారు.

ఓటమి భయంతోనే నామినేషన్ల అడ్డగింతలు: బందెల కిరణ్‌రాజ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని పార్టీ దివ్యాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు బందెల కిరణ్‌రాజ్ అన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో దివ్యాంగ ఓటర్లకు అవసరమైన వీల్‌చైర్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేసే వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.

నిష్పక్షపాత ఎన్నికలే లక్ష్యం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలని, నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine