Homeఆంధ్రప్రదేశ్చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి

చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి

Lord Malayappa Swamy adorned as Lord Krishna on the Chinna Sesha Vahanam during Tirumala Navaratri Brahmotsavams

గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ వైభవంగా వాహనసేవ

తిరుమల | వారధి న్యూస్ | అక్టోబర్ 13: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో స్వామివారు దర్శనమివ్వడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

గోవింద నామస్మరణలతో మార్మోగిన మాడ వీధులు

సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారి వాహనసేవ తిరుమలలో కన్నులపండువగా సాగింది. ముందుగా గజాలు, అశ్వాలు నడవగా, భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వివిధ కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక చిన్నశేష వాహనం

వైష్ణవ సంప్రదాయం ప్రకారం భగవంతుడిని ‘శేషి’గా, ప్రపంచాన్ని ‘శేషభూతం’గా భావిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే చిన్నశేష వాహనం ఈ భావనకు ప్రతీకగా నిలుస్తుంది. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుందని, కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

రాత్రి హంస వాహనంపై స్వామివారి దర్శనం

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహనసేవలో పాల్గొన్న ప్రముఖులు

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News

- Advertisment -
Google search engine

Most Popular

హైదరాబాద్

- Advertisment -
Google search engine
- Advertisment -
Google search engine