ఆంధ్రప్రదేశ్‌ను పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని విస్తరింపజేసే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఏపీ గ్రీన్’ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ సారథ్య బాధ్యతలను జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ జీవో ఆర్టీ నంబర్ 93ను అధికారికంగా విడుదల చేసింది. అంతేకాకుండా, ఈ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వీలుగా నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాను కూడా కల్పించింది.

ఏపీ గ్రీన్ ఏమిటీ ? లక్ష్యం ఏంటి?
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కచ్చితమైన ఫలితాలు సాధించాలన్నదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న అటవీ, చెట్ల విస్తీర్ణాన్ని 2047 నాటికి రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఏకంగా 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం ఒక భారీ లక్ష్యాన్ని (Mission 2047) నిర్దేశించుకుంది.
ఈ బృహత్తర కార్యాచరణ కోసం ఏపీ గ్రీన్ సొసైటీ కింద గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీలతో పాటు జిల్లా స్థాయిలో పనులను పరుగులు పెట్టించేందుకు ‘డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలు’ (DGDA) కూడా రంగంలోకి దిగుతున్నాయి.
నాగబాబు ముందున్న బాధ్యతలు:
ఈ పాలకమండలికి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్న నాగబాబు.. క్షేత్రస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాల నుంచి అటవీ సంరక్షణ చర్యల వరకు ప్రణాళికలను పర్యవేక్షించనున్నారు. జిల్లా స్థాయి కమిటీలను సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం నిర్దేశించిన 50 శాతం పచ్చదనం లక్ష్యాన్ని చేరేలా అధికార యంత్రాంగాన్ని నడిపించడంలో ఆయన పాత్ర అత్యంత కీలకం కానుంది. బాధ్యతాయుతమైన ఈ పదవిలో ఆయన ఉన్నంతకాలం కేబినెట్ హోదా నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మొత్తానికి, పర్యావరణ పరిరక్షణను ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం.. ఆ పగ్గాలను నాగబాబు చేతిలో పెట్టడంతో ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను మరింత పెంచింది.














