యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త
క్యాడెట్ నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌ను జెండా ఊపి ప్రారంభం
చిన్న వయస్సులోనే పిల్లల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. సైక్లింగ్‌తో ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోటీతత్వ స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు.

నాగోల్‌లోని బండ్లగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన మొదటి క్యాడెట్ జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ – 2026కు ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. మల్లారెడ్డితో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.
డాక్టర్ మ్యాక్స్‌వెల్ ట్రెవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సాంకేతిక పర్యవేక్షణ, గుర్తింపుతో, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో ఈ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8 నుంచి 11 ఏళ్ల వయస్సు గల 154 మంది బాలబాలికలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులకు ఇలాంటి పోటీలు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, నిర్వాహకులు అందిస్తున్న ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరెంతో మంది యువ సైక్లిస్టులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాకారులు నిరంతరం సాధన చేయాలని సూచించారు.
అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఉప్పల శ్రీనివాస్ గుప్త మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ మ్యాక్స్‌వెల్ ట్రెవర్ సైక్లింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మ్యాక్స్‌వెల్ ట్రెవర్, జనరల్ సెక్రటరీ ఎం.కె. పాషా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. మల్లారెడ్డి, నిర్వాహకులు, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ సైక్లిస్టులు పాల్గొన్నారు.








