
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్ గౌడ్ మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. లింగోజిగూడలోని కామేశ్వరరావు కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులకు మట్టి గణపతి ప్రతిమలను అందజేశారు.
ఈ సందర్భంగా కందికంటి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను వినియోగించడం వల్ల చెరువులు, నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. మట్టి గణపతులను ఉపయోగించడం వల్ల నిమజ్జనం అనంతరం అవి సహజంగా నీటిలో కలిసిపోతాయని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పండుగల సందర్భంగా సంప్రదాయాలను పాటించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కాలనీ ప్రజలు మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.












