83 మంది హెచ్ఎంలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్ | వారధి న్యూస్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు అధికంగా ఉన్న సర్ప్లస్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల కొరత ఉన్న డెఫిసిట్ పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను కేటాయించినట్లు తెలిపారు. కేటాయించిన ఉపాధ్యాయులను సంబంధిత పాఠశాలల నుంచి విధుల నుంచి రిలీవ్ చేసి, వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరేలా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
అయితే ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకుండా కేటాయించిన ఉపాధ్యాయులను విధుల నుంచి రిలీవ్ చేయని 83 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను సముచిత కారణం లేకుండా ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత అధికారులపై నిబంధనల ప్రకారం తదుపరి విభాగీయ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల్లో విద్యాబోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉపాధ్యాయుల అందుబాటును సమతుల్యం చేయడం, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడమే వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.










