varadhinews.com

ఏపీ వెదర్ అలెర్ట్.. ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్..!

తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో జూన్ 20 (శనివారం) ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రేపు (శనివారం) అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మరోవైపు కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం (20-06-26) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి అత్యధికంగా అనంతపురం జిల్లా సిద్దరాంపురంలో 61మిమీ వర్షపాతం నమోదయ్యింది.  శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 36మిమీ, వైఎస్సార్ కడప జిల్లా చౌడూరులో 31మిమీ, శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టిలో 29.9మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 28.2మిమీ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి 26.5మిమీ, కోటబొమ్మాళిలో 26.2మిమీ, లావేరులో 22.5మిమీ, కర్నూలు జిల్లా తోవిలో 22మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్‌లో యాడ్‌ చేయడం, పార్శిల్‌ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూడటం.. ఇదంతా ఒక తీపి అనుభూతి. అయితే, ఈ అలవాటు జేబుకు బాగానే చిల్లు పెడుతుంది. ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా షాపింగ్‌ చేసేస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా యువత ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అదే డోపమైన్‌ సైట్లలో షాపింగ్‌ చేయడం. నిజానికి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు.. వాటిని కొనడం వల్ల వచ్చే ఆనందం కంటే.. దానిని వెతికి, కార్ట్‌లో వేసి, ఆర్డర్‌ బటన్‌ నొక్కే ప్రక్రియలోనే మన మెదడులో ‘డోపమైన్‌’ అంటే ఆనందాన్నిచ్చే హార్మోన్‌ ఎక్కువగా విడుదలవుతుందని సైకాలజిస్టులు చెబుతారు. కొరియాలో వచ్చిన ఈ ఫేక్‌ డోపమైన్‌ అంటూ డూప్‌ మైన్‌ యాప్స్‌ సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుతున్నాయి. ఈ యాప్స్‌ చూడటానికి వంద శాతం అసలైన షాపింగ్‌ సైట్ల లాగే ఉంటాయి. ఇందులో వందలాది ప్రొడక్ట్స్, వాటి రేటింగ్‌లు, కస్టమర్‌ రివ్యూలు, డిస్కౌంట్‌ ఆఫర్లు అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దుస్తులు లేదా గాడ్జెట్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని ‘కార్ట్‌’లో వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అడ్రస్‌ ఎంటర్‌ చేసి ‘ఆర్డర్‌’బటన్‌ కూడా నొక్కవచ్చు. ట్విస్ట్‌ ఏంటంటే మీరు ఆర్డర్‌ నొక్కగానే స్క్రీన్‌ మీద ఒక డెలివరీ బాయ్‌ మీ ఆర్డర్‌ని తీసుకుని, బైక్‌ మీద మీ ఇంటి వైపు వస్తున్నట్లు మ్యాప్‌లో లైవ్‌గా చూపిస్తుంది. వస్తువు మీ ఇంటికి చేరేవరకు ఉండే ఆ ఉత్కంఠ, ఎగ్జైట్‌మెంట్‌ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ చివరకు మీ ఇంటికి ఎలాంటి వస్తువూ రాదు, మీ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఒక్క రూపాయి కూడా కట్‌ అవ్వదు! దీంతో షాపింగ్‌ ఖర్చు నుంచి తప్పించుకోవడంతో షాపింగ్‌ చేశామన్న అనుభూతినీ పొందవచ్చు. ఈ పద్ధతిలో డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ, ఇది ఒక రకమైన మానసిక వ్యసనానికి దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు. ఏ వస్తువు కొనకపోయినా, ఆ సైట్లలో గడపడం వల్ల షాపింగ్‌ చేయాలనే అదే ప్రవర్తన మెదడులో బలోపేతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్‌ దక్షిణ కొరియాకే పరిమితమైంది. ఏదేమైనా, షాపింగ్‌ పిచ్చిని వదిలించుకోవడానికి కొరియన్లు కనిపెట్టిన ఈ మార్గం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పైసా ఖర్చు లేకుండా షాపింగ్‌ మజాను అందించే ఈ ‘ఫేక్‌ స్టోర్స్‌’ ఐడియా మాత్రం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

రిజర్వ్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు జులై 6లోపు అప్లై చేసుకోవాలి. బ్యాంకింగ్, టెక్నాలజీ, పాలసీ రీసెర్చ్ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్‌బీఐ మంచి అవకాశం కల్పిస్తోంది.. RBI Young Professionals Recruitment భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 12 యంగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 6, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రిస్క్‌, పాలసీ అనాలిటిక్స్‌, క్లైమేట్‌ చేంజ్‌ రిస్క్‌ అండ్‌ సస్టేయినబుల్‌ ఫైనాన్స్‌, క్రేడిట్‌ రిస్క్‌ అనలిటిక్స్‌ అండ్‌ రెగ్యులేటరీ పాలసీ, పేమెంట్‌ ఎకోసిస్టమ్‌, పాలసీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ డొమెస్టిక్‌ అండ్‌ క్రాస్‌బోర్డర్‌ పేమెంట్‌ సిస్టమ్‌, పాలసీ అండ్‌ రిసెర్చ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ, డేటా అనాలసిస్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌.. తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగాన్ని బట్టి సీఏ, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అప్లికేషన్‌ చివరి తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను yphrmdco@rbi.org.in ఈమెయిల్ ద్వారా పంపాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే యువ నిపుణులకు ఆర్‌బీఐ తాజా నియామకాలు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ఇక పై డాక్టర్ చిట్టీ ఉంటేనే దగ్గు మందు! .. చిన్నారుల ప్రాణం తీసే సిరప్!

దేశంలో దగ్గు మందుల విక్రయాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన నిబంధనలు తెచ్చింది. 1945 ఔషధ నిబంధనలను సవరిస్తూ ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. దేశంలో మందుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన తెచ్చింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు, జలుబు వస్తే నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి కొనుగోలు చేసే దగ్గు మందులపై కేంద్రం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల వారు దగ్గు మందులను విక్రయించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ 1945 నాటి ఔషధ నిబంధనలలో సవరణలు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా సాధారణంగా ఓవర్‌ ది కౌంటర్‌ లభించే దగ్గు నివారణ మందులను ఇకపై షెడ్యూల్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించింది. సాధారణంగా ఈ షెడ్యూల్ పరిధిలో ఉండే ఔషధాల విక్రయాలకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ వెసులుబాటును కేంద్రం రద్దు చేసింది. దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉపశమనం కోసం వాడే సిరప్‌లను ఇకపై మెడికల్ షాపుల్లో నేరుగా ఓవర్-ది-కౌంటర్ పద్ధతిలో అమ్మడానికి వీల్లేదు. అర్హత కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ రాసిచ్చిన పత్రం చూపిస్తేనే ఫార్మసిస్ట్లు ఈ మందులను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులు అమ్మినట్లు తేలితే మెడికల్ షాపు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధించేలా కొత్త రూల్స్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో యువత, పాఠశాల విద్యార్థులు సైతం కొన్ని రకాల దగ్గు మందులను మత్తు కోసం, పరిమితికి మించి ఇష్టానుసారంగా వాడుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనికి తోడు, వైద్యుడి సలహా లేకుండా సొంత వైద్యం వల్ల ప్రజల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా భారతీయ సిరప్‌ల నాణ్యతపై గతంలో కొన్ని వివాదాలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం అని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల మందుల బ్లాక్ మార్కెటింగ్‌కు, దుర్వినియోగానికి బ్రేక్ పడనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా చిన్నారుల మరణాలు నమోదుకావడం 2025 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగిన మధ్యప్రదేశ్‌ లోని చింద్వారాకు చెందిన 22 మంది చిన్నారులు మరణించగా.. కొందరు అస్వస్థతకు గురయ్యారు. పిల్లలకు ఇచ్చిన కోల్డ్‌రిఫ్‌ దగ్గుమందుపై ఔషధ నియంత్రణ సంస్థ చేపట్టిన పరీక్షల్లో షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ఆ దగ్గు సిరప్‌ ను సూచించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని పోలీసులు అరెస్టు చేశారు. సిరప్‌ను తయారు చేపిర తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్‌ ఫార్మా యూనిట్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేయగా అందులో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు తెలిపారు. మరో ఘటనలో జైపూర్‌కు చెందిన కేసన్స్ తయారుచేసిన సిరప్‌కు నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో 40 నమూనాలు విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఈ సిరప్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. కిడ్నీ సంబంధిత సమస్యలున్న పిల్లలు ఈ సిరప్ తీసుకోవడం వల్ల మరింత తీవ్రమైన ప్రభావం పడుతోందని అధికారులు గుర్తించారు. 2 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు దగ్గు సిరప్ వాడకూడదని.. 5 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు సిరప్‌ను సూచించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారుల మరణాలకు కారణమైన ఆ దగ్గుమందును ఇతర ఏ ఏ దేశాలకు ఎగుమతి చేశారంటూ భారత్‌ను డబ్ల్యూహెచ్ఓ అడిగింది. గతంలో కొడిన్‌ దగ్గుమందు నైజీరియాలో లక్షలాది మందిని మత్తులో ముంచేసింది. దేశమంతటా యువతరం ఈ మందును మాదక ద్రవ్యంలా ఉపయోగించారు. ఈ దగ్గు మందుకు బానిసలైన వారి సంఖ్య బాగా పెరిగింది. డాక్టర్లు చీటీ మీద రాసిస్తే మాత్రమే అమ్మాల్సిన ఆ మందు డ్రగ్ డీలర్ల చేతుల్లోకి పోయి.. వీధుల్లో అక్రమ వ్యాపారానికి కారణమైంది. ఈ అంశాలపై అంతర్జాతీయ మీడియా ఆరా తీస్తే ఈ కుంభకోణంలో బడా ఫార్మా కంపెనీలున్నాయని వెల్లడైంది. నైజీరీయా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక రోజులో సుమారు 30 లక్షల సిరప్ సీసాలు అమ్ముడుపోయేవి. దీని తియ్యని స్ట్రాబెర్రీ రుచి పూర్తిగా బానిసగా మార్చేస్తుంది. కొడీన్ సిరప్ ను పరిమితికి మించి వాడితే అది మెదడుపై ప్రభావం చూపడమే కాదు ఉన్మాదిగా మార్చేస్తుందనీ నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పునరావాస కేంద్రంలో ఎక్కడ హింస చెలరేగుతుందోనని బాధితుల్ని గొలుసులతో కట్టేసి ఉంచాల్సి వచ్చింది. ప్రపంచానికి చౌకగా, నాణ్యమైన మందులు అందించే దేశంగా భారత్‌కు “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్” అనే గుర్తింపు ఉంది. అయితే అక్టోబర్‌ 2025లో జరిగిన చిన్నారుల మరణాలు ఈ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ వివాదం 2022లో ఆఫ్రికా దేశమైన గాంబియాలో మొదలైంది. అక్కడ పలువురు చిన్నారులు అనారోగ్యానికి గురై మరణించడంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ప్రయోగశాల పరీక్షల్లో కొన్ని పిల్లల సిరప్‌లలో ప్రమాదకర స్థాయిలో డైఎథిలీన్ గ్లైకాల్ (DEG), ఎథిలీన్ గ్లైకాల్ (EG) అనే విషపూరిత రసాయనాలు ఉన్నట్లు తేలింది. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ దగ్గుకు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రజారోగ్య ప్రయోజనాలు, మత్తు పదార్థాల నియంత్రణను పరిగణనలోకి తీసుకుంటే ఇది ఎంతో అవసరమైన నిర్ణయమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. ఉచిత దర్శనం టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు..

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ ఉచిత దర్శన టోకెన్ల జారీ సమయాలను మార్చింది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో టికెట్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు రద్దీ తగ్గడంతో సమయంలో మార్పులు చేశారు. Tirumala Darshan తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను(ఎస్‌ఎస్‌డీ) ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఈ టోకెన్లు జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉదయం 5 గంటలకు వీటిని అందిస్తున్నారు. అయితే ఇక నుంచి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. శుక్రవారం నుంచే ఈ సమయాల్లో మార్పులు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌డీ దర్శన టికెట్లను అందిస్తోంది. రైల్వే స్టేషన్ పక్కన ఉండే విష్ణునివాసం, బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెట్లను అందిస్తున్నారు. రోజుకు 15 వేల టోకెన్ల వరకు జారీ చేస్తున్నారు. సమయంలో మార్పులు.. కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లేవారి కోసం మరో 2 వేల టోకెన్లను అందిస్తున్నారు. ఓరిజినల్ ఆధార్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ అందిస్తే మీ ఫొటో తీసుకుని ఈ దర్శనం టోకెన్ ఉచితంగా అందిస్తారు. అయితే రెండు, మూడు గంటల పాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో జారీ చేశారు. ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడం, వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో టికెట్లు అందించే సమయాల్లో మార్పులు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవాలు అటు జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పో్త్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ జేఈవో శరత్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా విద్యుత్, త్రాగునీరు, దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పల ఫిట్‌నెస్ పరిశీలించేలా ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్, పుష్పాల అలంకరణలతో తెప్పలను తీర్చిద్దాలని తెలిపారు. ఇక కోలాటాలు, సంగీత కచేరీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

వర్షాలు, ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. విదర్భ నుంచి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతున్న ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలోని బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాల అవకాశాలు ఎక్కువగా ఉండగా, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు.. ఈ క్రమంలోనే శనివారం నుంచి వాతావరణం మారిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. మహేష్ బాబు సినిమాలతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 1200 మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి కుటుంబంలో వెలుగులు నింపాడు. మహేష్ బాబును టాలీవుడ్ అందగాడు అని పిలుస్తూ ఉంటారు. చూడటాన్ని హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న జన్మించారు. ఈయన ప్రఖ్యాత నటుడు కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. సూపర్‌ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గౌతమ్‌, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు.

మహేష్ బాబుతో స్పోర్ట్స్ డ్రామా.. వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నా వారణాసి సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది. దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక మందాకినీ పాత్రలో నటిస్తుంది. అలాగే కుంభ అనే నెగిటివ్ పాత్రలో పృథ్వీరాజ్కనిపించనున్నారు. అలాగే వారణాసి సినిమాలో మహేష్ బాబు రెండు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. యానిమల్ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. దాంతో వారణాసి సినిమా తర్వాత సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, పలు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. రైతులు ఈ వర్షాలను స్వాగతిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. విద్యుత్ తీగలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యాంశాలు: