
జోగులాంబ గద్వాల | వారధి న్యూస్
కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ సూచించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం, విశ్వాసం కలిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు.
శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్లో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేసుల దర్యాప్తు, కోర్టు విచారణలు, పెండింగ్ వారెంట్లు, సాక్షుల హాజరు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
బలమైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలని ఎస్పీ సూచించారు. సేకరించిన ఆధారాలను కోర్టులో సమర్థవంతంగా సమర్పించడంతో పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ కేసుల విచారణను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
కోర్టు సమన్లను సంబంధిత వ్యక్తులకు సకాలంలో అందజేయడంతో పాటు, వాటి వివరాలను CCTNSలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ వారెంట్లను త్వరితగతిన అమలు చేయాలని సూచించారు. మూడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న వారెంట్ల విషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని, ప్రొక్లమేషన్ ఆదేశాలను కూడా CCTNSలో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
బాధితులు, సాక్షులకు అండగా ఉండాలి
ఫిర్యాదుదారులు, బాధితులు, సాక్షులు నిర్ణీత తేదీల్లో కోర్టుకు హాజరయ్యేలా దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. సాక్షుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలక్ట్రానిక్ ఆధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా కేసుల నిరూపణలో కీలకమని పేర్కొన్నారు.
బాధితులతో పోలీసులు గౌరవంగా, సున్నితంగా వ్యవహరించాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించడం పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు.
కేసుల విచారణలో జాప్యం ఉండకూడదు
కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేసి, సకాలంలో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. కోర్టు విచారణల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత మేజిస్ట్రేట్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
దర్యాప్తు సమయంలో ఎదురయ్యే సమస్యలు, జాప్యానికి దారితీసే అంశాలను సంబంధిత ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అవసరమైతే ఉన్నతాధికారుల స్థాయిలో కూడా తగిన సూచనలు, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని, కేసుల విచారణ వేగవంతమయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చూడటం, సాక్షులకు రక్షణ కల్పించడం, నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సమర్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ టి. శ్రీనివాస రావు పేర్కొన్నారు.












