
హైదరాబాద్ ఎల్బీనగర్ వారధి న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జీవో 118 పరిధిలోని ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జీవో 118కు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపే చర్యల్లో భాగంగా ఈ ధ్రువపత్రాల పంపిణీ చేపట్టారు. అధికారుల వివరాల ప్రకారం నియోజకవర్గంలోని 44 కాలనీలకు సంబంధించిన క్రమబద్ధీకరణ సమస్యలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీవో 118 కింద రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 9,792 ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్ల సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామని, మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశాలతో పాటు దరఖాస్తు చేసుకోని వారి సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
కార్యక్రమంలో లబ్ధిదారులకు క్రమబద్ధీకరణకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. దీంతో ఎన్నాళ్లుగానో తమ ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం చేపడుతున్న క్రమబద్ధీకరణ ప్రక్రియను అధికారులు వివరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మధుయాష్కీ గౌడ్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, కాలనీల ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ధ్రువపత్రాల పంపిణీ సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు, లబ్ధిదారులు చేరుకోవడంతో సందడి నెలకొంది. జీవో 118 సమస్యకు పరిష్కారం లభిస్తే తమ ఆస్తులపై హక్కులు, రిజిస్ట్రేషన్ల విషయంలో స్పష్టత వస్తుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేశారు.














