
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. విదర్భ నుంచి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతున్న ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలోని బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్షాల అవకాశాలు ఎక్కువగా ఉండగా, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు.. ఈ క్రమంలోనే శనివారం నుంచి వాతావరణం మారిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.