Home తెలంగాణ పొరపాటుగా 22-ఏ జాబితాలో చేరిన పట్టా భూములను పరిశీలిస్తాం ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు: జిల్లా...

పొరపాటుగా 22-ఏ జాబితాలో చేరిన పట్టా భూములను పరిశీలిస్తాం ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0

రంగారెడ్డి, వారధి న్యూస్: 22-ఏ నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన నిజమైన పట్టా భూములను పరిశీలించి, రికార్డులు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. 22-ఏ జాబితా విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, చట్టపరంగా నిషేధిత జాబితాలో ఉంచాల్సిన భూములను మాత్రమే నిబంధనల ప్రకారం 22-ఏ జాబితాలో కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మంగళవారం శంషాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ రికార్డుల నిర్వహణ, 22-ఏ జాబితా, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులు, రికార్డుల సవరణ ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 22-ఏ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి పాత, కొత్త సర్వే నంబర్ల మార్పులు, భూముల విభజన, సరిహద్దులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. పాత సర్వే నంబర్ల ఆధారంగా ఉన్న భూములు, కొత్త సర్వే నంబర్లలో మిగిలిపోయిన భూములు, సరిహద్దులపై స్పష్టత అవసరమైన అంశాలను అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

పహాణీలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, పాత సర్వే నంబర్లు, సర్వే రికార్డులు, ఇతర ప్రభుత్వ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రికార్డును మాత్రమే ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోకుండా, అన్ని సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత న్యాయస్థానాల తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

యూఎల్‌సీ భూములపై ప్రత్యేక పరిశీలన

పట్టణ ప్రాంతాల్లో గతంలో పట్టణ భూ పరిమితి చట్టానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయని, వాటి రికార్డులను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, ముఖ్యంగా జీవో 765, గతంలో జరిగిన చర్యలు, భూముల విముక్తి తదితర అంశాలను పరిశీలించి అర్హత ఉన్న భూముల విషయంలో నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

గతంలో భూ రికార్డులను సవరించుకోని వారు లేదా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయని వారు నిబంధనల ప్రకారం సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ అధికారులను సంప్రదించి తమ భూ రికార్డులను పరిశీలించుకోవాలని సూచించారు.

హెచ్‌ఎండీఏ పరిధిలోనూ పరిశీలన

హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, చట్టపరంగా 22-ఏ పరిధిలోకి వచ్చే భూములను మాత్రమే నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉంచాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

“నిజమైన పట్టా భూమి ఏదైనా పొరపాటున 22-ఏ జాబితాలో నమోదై ఉంటే ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అటువంటి భూములను కూడా పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం” అని కలెక్టర్ తెలిపారు.

ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా పహాణీలు, రిజిస్ట్రేషన్ రికార్డులు, పాత సర్వే వివరాలు, సరిహద్దులు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భూ రికార్డుల సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version