Home ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. ఇలాంటి వారితో జాగ్రత్త.. లేదంటే జేబుకు చిల్లే!

Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. ఇలాంటి వారితో జాగ్రత్త.. లేదంటే జేబుకు చిల్లే!

0

తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది. ఇలా ఫేక్ ఐడీతో గది కోసం క్యూలీ నిల్చున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tirumala Room Scam

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ గుర్తింపు కార్డులతో కొండపై గదులు పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్ విభాగం బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 16వ తేదీన అప్పటికే నకిలీ గుర్తింపు కార్డుతో ఒక గది పొందిన వ్యక్తి.. మరో ఫేక్ ఐడీ తీసుకొచ్చి మళ్లీ గది కోసం క్యూలో నిల్చున్నాడు. అది గమనించిన సీఆర్వో కార్యాలయం సిబ్బంది.. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

విచారణలో అతడిని కేరళ మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ పి.ఎం. (32)గా గుర్తించారు అధికారులు. అతని వద్ద రెండు నకిలీ ఆధార్ కార్డులు, గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ అనే దళారి ఒక్కో గదికి రూ.1,000 చొప్పున ఇస్తామని తనను నియమించుకున్నట్లు ఆషిక్ విచారణలో వెల్లడించాడు. నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు పొందడం, వాటిని దళారికి అప్పగించడం తన పని అని, ఆ గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపాడు. దీంతో ఘటనపై విజిలెన్స్ విభాగం తిరుమల-2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నమోదు చేసుకున్న పోలీసులు.. నకిలీ ఆధార్ కార్డుల ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు, సాంకేతిక ఆధారంగా ముఠా వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్నారు.

భక్తులకు సూచన

ఈ ఘటన నేపథ్యంలో భక్తులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. తిరుమలలో వసతి భక్తుల కోసం మాత్రమేనని, దళారుల ద్వారా గదులు కొనుగోలు చేయకూడదని, ఆధార్, ఫొటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు ఇవ్వకూడదని, అదేవిధంగా వసతిని సీఆర్వో కౌంటర్లు, టీటీడీ అధికారిక వెబ్‌సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పొందాలని టీటీడీ తెలిపింది.

కంట్రోల్ రూమ్ నెంబర్

ఎవరైనా దళారి డబ్బు తీసుకుని గది ఇప్పిస్తానని సంప్రదించినా లేదా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ నెం: 9866898630 లేదా టీటీడీ కాల్ సెంటర్ నెం : 155257 కు సమాచారం ఇవ్వాలని భక్తులను కోరింది. అలాగే భక్తులను మోసగించే దళారులు, వారికి సహకరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version