ఒకప్పుడు వార్త అంటే ప్రజల జీవితాలను కదిలించే సత్యం. నేడు వార్త అంటే ముందుగా ఎవరు వార్త వేస్తే అదే వార్తగా చెలామణి, ముందుగా అనే ముసుగులో వేగంతో అది అసలు వార్తనా నకిలి వార్తనా అనేది బేరిజు వేయకుండా వార్తకు ప్రచారం కల్పించడమే నేటి వార్తల ముఖ్య ఉద్దేశం. ఒక రాజకీయ నాయకుడు తుమ్మినా, దగ్గినా, చేతులు ఊపినా, కొత్త బట్టలు ధరించినా, డ్యాన్సులు వేసినా..అది బ్రేకింగ్ న్యూస్‌గా మారుతున్న ఈ రోజుల్లో, మనం తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది శత్రుత్వం కాదు
ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది శత్రుత్వం కాదు, అది అధికారాన్ని సరిదిద్దే అద్దం. ఆ అద్దం పొగమంచు పట్టి, బూజు పట్టి, వంకర్లు తిరిగితే సమాజం చూసేది కూడా వంకర్లు తిరిగిన, వక్రీకరించిన వార్తలే.
- నాలుగో స్థంభం యొక్క అసలు ధ్యేయం*
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియాను ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా పిలిచారు. ఇది గౌరవం కోసం కాదు, బాధ్యత కోసం. ప్రజల తరఫున నిలబడి అధికారాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాల గొంతును బలంగా వినిపించడం, అవినీతిని వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం – ఇదే జర్నలిజం యొక్క ఆత్మ.
టీఆర్‌పీ కోసం ప్రజా సమస్యల త్యాగం
కానీ నేడు ఆ విశ్వాసం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. కారణం ఏమిటంటే.. మనం వార్తల ప్రాధాన్య క్రమాన్ని పూర్తిగా మార్చేశాం. టీఆర్‌పీ రేటింగ్‌లు, యూట్యూబ్ వ్యూస్, వైరల్ కావాలనే తాపత్రయం వార్తల విలువను నిర్ణయిస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రైతుల కష్టాలు, మహిళల అవస్థలు, గుంతల రోడ్లపై ప్రతిరోజూ జరిగే ప్రమాదాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, పాఠశాలల్లో కూలిపోతున్న గోడలు, రైతు ఆత్మహత్యల వెనుక ఉన్న వ్యవస్థాగత కారణాలు – ఇవన్నీ ఇప్పుడు వార్తల చివరి పేజీలకు నెట్టివేయబడుతున్నాయి. వాటి స్థానాన్ని ఒక నాయకుడి పుట్టినరోజు వేడుకలు, పార్టీల మధ్య మాటల యుద్ధాలు ఆక్రమిస్తున్నాయి. సమాజంలో ఏది వార్తగా నిలుస్తుందో దాని ఆధారంగానే ఆ సమాజపు ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. ప్రజల సమస్యల స్థానంలో ప్రచార కార్యక్రమాలు నిలిచినప్పుడు, ప్రజాస్వామ్యం బలపడదు. ప్రచారమే బలపడుతుంది.
మసకబారుతున్న పరిశోధనాత్మక జర్నలిజం
ఇది కేవలం కంటెంట్ సమస్య మాత్రమే కాదు. ఇది జర్నలిజం యొక్క పునాదులకే సవాలు. ఒకప్పుడు నెలల తరబడి ఆధారాలు సేకరించి, ప్రాణాలకు తెగించి పెద్ద పెద్ద కుంభకోణాలను బయటపెట్టే పరిశోధనాత్మక జర్నలిజం నేడు అరుదైపోయింది. దానికి బదులుగా ధృవీకరించని వాట్సాప్ ఫార్వర్డ్‌లు, సోషల్ మీడియా పోస్టులు వేగం పేరుతో వార్తలుగా ప్రసారం అవుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా, రెండు పక్షాల మాట వినకుండా, కేవలం సంచలనం కోసం వార్తను వండడం అలవాటైపోయింది. ఇది కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాదు, మొత్తంగా జర్నలిజంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
జర్నలిస్టులపై ఒత్తిళ్లు, సవాళ్లు
దీనికి పూర్తి బాధ్యతను కేవలం ఫీల్డ్‌లో పనిచేసే రిపోర్టర్‌పై మోపడం న్యాయం కాదు. జర్నలిస్టులపై యాజమాన్య ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రకటనల ఆదాయం కోసం రాజీ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. డిజిటల్ యుగంలో పోటీ విపరీతంగా పెరిగింది. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేదు. “ఈరోజు సంచలన వార్త లేకపోతే రేపు ఉద్యోగం ఉండదు” అనే భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. అయినప్పటికీ, ఈ సవాళ్ల మధ్య కూడా ప్రజా ప్రయోజనం అనే మూల సూత్రంతో రాజీ పడకుండా నిర్భయంగా, నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మనసుల చురగొన్న వారు కూడా ఉన్నారు.
మీడియా, ప్రజలు, ప్రభుత్వ బాధ్యత
ముందుగా మీడియా సంస్థలు తమను తాము ప్రశ్నించుకోవాలి. ప్రేక్షకులకు ఏది నచ్చుతుంది అనే దానికంటే, సమాజానికి ఏది అవసరం అనే ప్రశ్నకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ప్రతి సంస్థలో బలమైన ఫ్యాక్ట్-చెకింగ్ వ్యవస్థ ఉండాలి. జిల్లా, మండల స్థాయిల్లో క్షేత్రస్థాయి రిపోర్టింగ్‌ను ప్రోత్సహించాలి. అదే సమయంలో ప్రజలు ధృవీకరించని వార్తలను గుడ్డిగా ఫార్వర్డ్ చేయడం మానాలి. సత్యాన్ని వెలికి తీసే మీడియాను ప్రజలు ఆదరించాలి. ప్రభుత్వాలు కూడా విమర్శను శత్రుత్వంగా చూడకుండా, సమాచార హక్కును గౌరవించాలి. నిజం రాసినందుకు జర్నలిస్టులపై దాడులు జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవాలి.
ఇంకా బతికే ఉన్న జర్నలిజం
ఇప్పటికీ వరదల్లో, విపత్తుల్లో, సరిహద్దుల్లో, మారుమూల గ్రామాల్లో ప్రాణాలకు తెగించి వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. డేటాను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలతో సహా బయటపెడుతున్న జర్నలిస్టులు ఉన్నారు. వీరి వల్లే ఇంకా జర్నలిజంపై సమాజానికి విశ్వాసం ఉంది.
- ప్రచారం కాదు.. ప్రజల సమస్యలే ముఖ్యం*
“తుమ్మితే వార్త” అనే వ్యంగ్యం నుంచి బయటపడి, “ప్రజల సమస్యే వార్త” అనే నినాదం వైపు మనం తిరిగి వెళ్లాలి. సంచలనం తాత్కాలికమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ సత్యం మాత్రమే శాశ్వతంగా సమాజాన్ని నిలబెడుతుంది. నాలుగో స్థంభం కదిలితే, ప్రజాస్వామ్య భవనమే కూలిపోతుంది. కాబట్టి
వేగం కోసం విశ్వసనీయతను తాకట్టు పెట్టే ధోరణి మీడియాపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ప్రతి నిమిషం సమాచారం ప్రవహిస్తోంది. కానీ సమాచారం ఎక్కువ కావడం వల్ల సత్యం కూడా ఎక్కువ అవుతుందని చెప్పలేం. అందుకే ఫ్యాక్ట్-చెకింగ్, ఆధారాల సేకరణ, రెండు పక్షాల అభిప్రాయాలు తెలుసుకోవడం వంటి ప్రాథమిక జర్నలిస్టిక్ ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు.
సంచలనానికి బదులుగా సత్యానికి విలువ ఇవ్వాలి.
ప్రజలకూ బాధ్యత ఉంది
ధృవీకరించని సమాచారాన్ని పంచుకోకూడదు. వాస్తవాలను వెలికితీసే మీడియాను ఆదరించాలి. కేవలం వినోదం కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలను ముందుంచే వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రభుత్వాలు కూడా విమర్శను వ్యతిరేకతగా కాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా స్వీకరించాలి. సమాచార హక్కును గౌరవించాలి. పారదర్శకతను పెంచాలి. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు భద్రత కల్పించాలి.